ప్రధాని అభ్యర్థి ఎంపికపై ఆందోళనకారుల ఆగ్రహం

ప్రధాని అభ్యర్థి ఎంపికపై ఆందోళనకారుల ఆగ్రహం

ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో నిరసనలు మిన్నంటాయి. ఇరాన్ అనుకూల పార్టీలు తమ దేశ ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ.. ఇరాక్ లో వందలాది మంది పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. బాగ్దాద్ లోని పార్లమెంటు భవనంలోకి ఒక్కసారిగా దూసుకొచ్చారు. దీంతో బిల్డింగ్ మొత్తం ఆందోళనకారులతో నిండిపోయింది. ఇరాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరాక్ జెండాలను పట్టుకుని టేబుళ్లపైకి ఎక్కి ఆందోళన చేశారు. నిరసన టైంలో అక్కడ పార్లమెంటు సభ్యులు ఎవరూ లేకపోగా.. భద్రతా సిబ్బంది మాత్రమే ఉన్నారు. భద్రతా సిబ్బందే ఆందోళనకారులను లోపలకు పంపించినట్లు తెలుస్తోంది. కాగా నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాల్స్ వాడారు. అయినా.. గేట్లు బద్దలుగొట్టి పార్లమెంటులోకి దూసుకొచ్చారు. గతేడాది అక్టోబరులో ఇరాక్ ఎన్నికలు జరిగిన తర్వాత ఇదే అతి పెద్ద ఆందోళన.

ఇటీవల మహమ్మద్ ఆల్ సుడానీని ఇరాన్ అనుకూల షియా పార్టీలు ప్రధాని నామినీగా ఎంపిక చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ.. ఇరాక్ లో ఆందోళన చేప్టటారు. నిరసనకారుల్లో చాలా మంది మత పెద్ద ముఖ్తాదా ఆల్ సదర్ అనుచరులే ఉన్నారు. ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించినా.. పదవి మాత్రం దక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. ఆందోళనకారులు ప్రశాంతంగా ఉండాలని తాత్కాలిక ప్రధాని ముస్తఫా ఆల్ కధిమీ కోరారు. ఆల్ సుడానీని స్టేట్ ఆఫ్ లా నేత, మాజీ ప్రధాని నౌరీ ఆల్ మాలికి ఎంపిక చేశారు. పార్లమెంటులో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే అంతకు ముందే అధ్యక్షుడ్ని ఎంపిక చేయాల్సిం ది. తగినంత సభ్యుల బలం లేక ఆల్ సదర్ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ నుంచి వైదొలిగింది. దీంతో ముఖ్తాదా ఆల్ సదర్ కు మద్దతుగా ఆందోళనలు చేస్తున్నారు.