వందల సంఖ్యలో రామ చిలకలు మృతి: వీడియో చూస్తుంటే బాధేస్తోంది..!

వందల సంఖ్యలో రామ చిలకలు మృతి: వీడియో చూస్తుంటే బాధేస్తోంది..!

లక్నో: ప్రముఖ పుణ్యక్షేత్రాలకు నిలయమైన ఉత్తరప్రదేశ్‎లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. బుధవారం (మే 21) యూపీ వ్యాప్తంగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం విధ్వంసం సృష్టించింది. వర్ష బీభత్సానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 మంది చనిపోయారు. పలు చోట్ల చెట్లు, కరెంట్ స్థంభాలు, హోర్డింగ్‎లు విరిగిపడ్డాయి. ఈ వర్ష ప్రభావం మూగ జీవాలు, పక్షులపైన చూపించింది.

 భారీ వర్షానికి పలుచోట్ల మూగ జీవాలు ప్రాణాలు కోల్పోగా.. ఝాన్సీ జిల్లాలో వందల సంఖ్యలో రామ చిలుకలు మృతి చెందాయి. దాదాపు 100 రామ చిలుకలు మరణించగా.. మరో 50 కి పైగా చిలుకలు గాయపడ్డాయి. వందల సంఖ్యలో పక్షులు మృతి చెందడం చూసిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించింది.

చనిపోయిన చిలుకలను గుంటలో పూడ్చిపెట్టారు. ఒకేసారి వందల సంఖ్యలో రామ చిలుకలు మృతి చెందటం ఝాన్సీ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. రామ చిలుకలు చనిపోయి నేలపై చెల్లాచెదురుగా పడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియో చూసి పలువురు జంతు ప్రేమికులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయిన చిలుకలను చూసి నెటిజన్లు కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి వందల సంఖ్యలో చిలుకలు మృతి చెందటం చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని, తీవ్రంగా బాధేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.