కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. హంటర్ వ్యాలీలోని గ్రెటా సిటీలో ఉన్న వైన్ కంట్రీ డ్రైవ్ ప్రాంతంలో ఓ పెండ్లి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయినట్లు ఆస్ట్రేలియా పోలీసులు సోమవారం వెల్లడించారు. మరో 25 మందికి గాయాలయ్యాయని తెలిపారు. గాయపడినవారిని హెలికాప్టర్, రోడ్డు మార్గం ద్వారా ఆస్పత్రికి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. సమీపంలోని వైన్ ఎస్టేట్‌లో పెండ్లి రిసెప్షన్ జరిగిందని..అది ముగిసిన తర్వాత బస కోసం గెస్టులను బస్సులో సింగిల్టన్ సిటీకి పంపారని వివరించారు. రాత్రి సమయం కావడంతో రోడ్డును భారీ పొగమంచు కప్పివేసిందని.. వేగంగా వెళుతున్న బస్సు మూలమలుపు వద్ద బోల్తాపడిందన్నారు.
ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 53 మంది ఉన్నట్లు చెప్పారు. రాత్రి పదకొండున్నరకు సమాచారం అందిందని.. వెంటనే రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దింపామని తెలిపారు. గాయపడిన వారిలో నలుగురు డిశ్చార్జ్ అయ్యారని.. ట్రీట్మెంట్ పొందుతున్న వారిలో ఒకరి కండీషన్ సీరియస్ గా ఉన్నట్లు వెల్లడించారు. 53 ఏండ్ల బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు. ప్రమాదంలో 10 మంది చనిపోవడంపై ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.
