దిల్‌సుఖ్‌నగర్ లో ఆర్టీసీ బస్సు ఢీ కొని..భార్యాభర్తలు మృతి

దిల్‌సుఖ్‌నగర్ లో ఆర్టీసీ బస్సు ఢీ కొని..భార్యాభర్తలు మృతి

హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ వాహేద్ నగర్ ప్రధాన రహదారిపై ఘోరం జరిగింది. ఆర్టీసీ డిపో బస్సు ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆంద్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట గండ్రాయి గ్రామానికి  చెందిన తిరుపతిరావు, వెంకటమ్మ దంపతులు దిల్‌సుఖ్‌నగర్‌లోని కొత్తపేట ప్రాంతంలో నివసిస్తున్న తమ కుమార్తెను చూసేందుకు ఇటీవల నగరానికి వచ్చారు. జనవరి 1న  సాయంత్రం కుమార్తె యాక్టివా వాహనంపై భార్యాభర్తలిద్దరూ ట్యాంక్‌బండ్ చూసేందుకు బయలుదేరారు.  ఈ క్రమంలో మూసారాంబాగ్ హైటెక్ గార్డెన్ సమీపంలో, వెనుక నుంచి వేగంగా వచ్చిన దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో యాక్టివా వాహనాన్ని ఢీకొట్టింది.  బస్సు ఢీ కొట్టిన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో  రికార్డ్ అయ్యాయి.  దీంతో యాక్టివాపై ఉన్న దంపతులు రోడ్డుపై పడిపోయారు. బస్సు వెనుక టైరు వారిపై నుంచి వెళ్లడంతో తిరుపతిరావు, వెంకటమ్మ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న మలక్‌పేట్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ  ప్రమాదంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు