భార్యను హత్య చేసి నగలతో భర్త పరార్.. మెదక్  జిల్లా చేగుంటలో ఘటన

భార్యను హత్య చేసి నగలతో భర్త పరార్.. మెదక్  జిల్లా చేగుంటలో ఘటన

మెదక్(చేగుంట), వెలుగు: భార్యను హత్య చేసి భర్త పరారయ్యాడు. ఈ ఘటన శనివారం రాత్రి మెదక్  జిల్లా చేగుంటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక రైల్వే స్టేషన్  రోడ్డులోని వేంకటేశ్వర స్వామి ఆలయం వెనక నివాసం ఉండే ఉప్పరి వరలక్ష్మి(33)కి 2015లో నెల్లూరు జిల్లాకు చెందిన త్రిమూర్తులుతో పెళ్లి జరిగింది. అతను ఇల్లరికం వచ్చి చేగుంటలోనే ఉంటున్నాడు. వారికి ఒక కొడుకు ఉన్నాడు. కాగా, కొంత కాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈక్రమంలో శనివారం రాత్రి కూడా గొడవ జరగగా, కోపంతో త్రిమూర్తులు భార్య వరలక్ష్మి మెడపై పారతో కొట్టి హత్య చేశాడు. అనంతరం ఆమె మెడలో పుస్తెల తాడు, సెల్ ఫోన్, ఇంట్లో ఉన్న నగదు తీసుకొని పరారయ్యాడు.

తల్లిని హత్య చేస్తున్న సమయంలో  ఐదేళ్ల కొడుకు అక్కడే ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్  టీం ఆధారాలు సేకరించింది. మృతురాలి అక్క ఉప్పరి సంతోష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చైతన్య రెడ్డి తెలిపారు.