తాగిన మైకంలో రోకలిబండతో భార్య, పిల్లలపై దాడి

తాగిన మైకంలో రోకలిబండతో భార్య, పిల్లలపై దాడి
  • భార్య, కొడుకు మృతి, కూతురికి తీవ్రగాయాలు
  • రంగారెడ్డి పులిగోనిపల్లి తండాలో దారుణం

ఆమనగల్లు, వెలుగు: మద్యం మత్తులో ఓ వ్యక్తి రోకలి బండతో భార్య, ఇద్దరు పిల్లలపై దాడి చేయగా.. భార్యతో పాటు కుమారుడు చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన కూతురు హాస్పిటల్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటోంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం సీతారాంనగర్‌‌‌‌ తండా గ్రామపంచాయతీ పరిధిలోని పులిగోనిపల్లి తండాలో సోమవారం రాత్రి జరిగింది. 

తండాకు చెందిన బాణావత్‌‌‌‌ రాందాస్‌‌‌‌, కవిత (28) దంపతులకు కూతుళ్లు పవిత్ర, పావని, ప్రణీత (8), కుమారుడు హర్షిత్‌‌‌‌ (5) ఉన్నారు. పవిత్ర, పావని ఆమనగల్లులో హాస్టల్‌‌‌‌లో ఉంటూ చదువుకుంటుండగా.. మిగతా ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు తండాలో ఉంటున్నారు. 

కాటన్‌‌ మిల్లులో పనిచేసే రాందాస్‌‌ తరచూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. సోమవారం రాత్రి సైతం మద్యం తాగి రావడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన రాందాస్ కత్తి, రోకలిబండతో భార్య కవిత, కూతురు ప్రణీత, కుమారుడు హర్షిత్‌‌పై దాడి చేశాడు. 

కవిత, హర్షిత్‌‌ అక్కడికక్కడే చనిపోగా కూతురు ప్రణీతకు తీవ్ర గాయాలు అయ్యాయి. మంగళవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రణీతను హాస్పిటల్‌‌కు తరలించారు. ఘటనాస్థలాన్ని మహేశ్వరం ఏసీపీ జానకీరెడ్డి పరిశీలించి వివరాలు సేకరించారు. కవిత సోదరి చంద్రకళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా నిందితుడు రాందాస్‌‌ను ఆమనగల్లు కాటన్‌‌ మిల్లు సమీపంలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.