వికారాబాద్, వెలుగు: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను కర్రతో కొట్టి, డ్రిప్ పైప్‌తో వాతలు పెట్టి హత్య చేశాడు. మర్పల్లి ఎస్సై అబ్దుల్ రౌఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం బురాన్‌పల్లి గ్రామానికి చెందిన నర్మద(27)తో బంట్వారం మండల కేంద్రానికి చెందిన మంగలి రవీందర్‌కు 2018లో వివాహమైంది. వారికి కొడుకు, కూతురు ఉన్నారు. కొద్ది రోజుల తరువాత రవీందర్ మద్యానికి బానిసై నర్మదను తిడుతూ కొట్టేవాడు. గొడవ జరిగినప్పుడల్లా నర్మద తల్లిదండ్రుల వద్దకు వెళ్లేది. ప్రతిసారి పుట్టింటికి ఎందుకు వెళ్తావనిరవీందర్ ప్రశ్నించగా, అక్కడ వేరే వ్యక్తితో తనకు వివాహేతర సంబంధం ఉందని చెప్పింది.
ఈ క్రమంలో మంగళవారం రవీందర్ ఎవరితో వివాహేతర సంబంధం ఉందో చెప్పు లేదంటే చంపేస్తానని నర్మదను కట్టెతో తీవ్రంగా కొట్టాడు. డ్రిప్ పైప్‌ను వేడి చేసి ముఖం, తొడలు, కడుపుపై కాల్చాడు. శనివారం నర్మద భోజనం చేయలేక నీరసంగా ఉండడంతో భోజనం చేయమని మెడలు పట్టుకుని తోశాడు. ఆ తరువాత నర్మద వాంతులు చేసుకోవడంతో మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, డాక్టర్లు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. మృతురాలి సోదరుడు శశిగోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
