
‘‘చెప్పు.. నీకు నా మీద ప్రేముందా? ఉందా.. లేదా? నేను రోడ్డు మధ్యలో నిలబడతా. నా మీద ప్రేమ ఉందో లేదో ప్రూవ్ చెయ్ ” అంటూ పీకల దాకా తాగొచ్చిన ఓ మొగుడు రోడ్డెక్కా డు. వద్దురా మగడా.. నాకు నువ్వంటే ప్రేముంది.. వెళ్దాం పదరా అన్న వినిపించుకుంటే నా? హూ..హూ.. నేను నిలబడతా.. నువ్వు ప్రూవ్ చెయ్యి అంటూ రోడ్డు మధ్యలోకి పొయ్యాడు. దాదాపు 45 నిమిషాలు రోడ్డుమీద వాళ్లిద్దరి మధ్యా ఆ వాదన జరిగింది. విసుగొచ్చిన ఆ భార్య.. నీ ఖర్మ.. ఏం చేసుకుంటవో చేసుకో..పో.. అంటూ పక్కకు తప్పుకుంది. మనోడేమో రోడ్డు మీద దర్జాగా నిలబడ్డాడు. ఏముంది.. స్పీడ్ గా వస్తున్న ఓ వ్యాన్ ఢీకొట్టేసింది. మనోడికి భూమ్మీద నూకలు బానే ఉన్నట్టున్నాయి. దెబ్బలు పెద్దవే అయినా… అదృష్టవశాత్తు బయటపడ్డాడు. ఈ ఘటన చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న లిషువీలో జరిగింది.
భార్య ప్రేమను నిరూపించాలంటూ డిమాండ్ చేసిన ఆ భర్త పేరు పాన్. అతడి భార్య ఝౌ. తన భార్యతో గొడవైందని, అందుకే బయటకెళ్లి కొంచెం మందు తాగి వచ్చానని, ఆ తర్వాత ఇద్దరం మళ్లీ గొడవ పెట్టుకున్నామని పోలీసులకు పాన్ చెప్పాడు. తనను ప్రేమిస్తోందో లేదో తెలుసుకునేందుకు టెస్టు పెట్టాలనుకున్నానని, కానీ, ఆ టెస్టులో తానే ఫెయిలయ్యానని చింతించాడు పాన్. తలకు తీవ్రగాయాలు కావడంతో పాటు ఛాతీ ఎముకలు విరిగాయని పోలీసులు చెప్పారు.