చనిపోయిన భార్య విగ్రహాన్ని ఏర్పాటుచేసిన భర్త

చనిపోయిన భార్య విగ్రహాన్ని ఏర్పాటుచేసిన భర్త

పెళ్లితో ఒక్కటి చేసి.. చనిపోయేంత వరకు కలిసి ఉండేలా చేసేది భార్యాభర్తల బంధం. కష్టనష్టాలలో ఒకరికొకరు తోడుగా ఉంటూ.. ఆ బంధాన్ని కొనసాగిస్తారు. అటువంటి వారిలో ఎవరైనా ఒకరు దూరమైతే.. మరోకరి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పలేం. అలా భార్య దూరమైన ఓ భర్త.. ఆమె మీద ఉన్న ప్రేమతో విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు.

గద్వాల్ జిల్లా కేంద్రానికి చెందిన గంటలబోయిన హన్మంతు (83), రంగమ్మలు దంపతులు. వీరిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాళ్లు. అయితే రంగమ్మ రెండేండ్ల క్రితం సెప్టెంబరు 9, 2019న అనారోగ్యంతో మృతి చెందింది. భార్య రంగమ్మ జీవించినంతకాలం కష్టసుఖాలలో పాలుపంచుకుని తనకు అండగా ఉండటంతో ఆమెను మరచిపోలేని భర్త హన్మంతు.. ఆమె గుర్తుగా రూ. 7 లక్షల వ్యయంతో సొంత పొలంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా బంధువులు, కుటుంబసభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. భర్త.. తన భార్య విగ్రహం ఏర్పాటుచేయడంతో ఆ విగ్రహాన్ని చూసేందుకు చుట్టుపక్కలు గ్రామాల నుంచి ప్రజలు ఎక్కువ సంఖ్యలో అక్కడకు వస్తున్నారు.

హన్మంతు గతంలో తన సొంత పొలంలో దాతల సహాయంతో శివరామాంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించాడు. ఇప్పుడు ఆ ఆలయం పక్కనే తన భార్యకు మండపాన్ని ఏర్పాటు చేశాడు. హన్మంతుకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. తన నానమ్మ విగ్రహం ఏర్పాటుచేయడం మాకు చాలా సంతోషంగా ఉందని.. రంగమ్మ మనుమరాలు చెబుతోంది. నానమ్మ లేని లోటు ఈ విధంగా తీరిందని.. విగ్రహాన్ని చూస్తే.. ఆమెను చూసినట్లే ఉందని సంతోషం వ్యక్తం చేసింది.