పేరుకే మహిళా కార్పోరేటర్లు.. పెత్తనమంతా భర్తలదే

పేరుకే మహిళా కార్పోరేటర్లు.. పెత్తనమంతా భర్తలదే
  •     ప్రచారం నుంచి గెలిచాక వారిదే పై చేయి
  •     అభివృద్ధి పనుల వరకూ అంతే
  •     ఈ ఏడాది ప్రధాన పార్టీల నుంచి బరిలో 232 మంది మహిళలు

హైదరాబాద్, వెలుగురాజకీయాల్లో మహిళలకు మంచి అవకాశాలే వస్తున్నాయి. 50 శాతం రిజర్వేషన్లూ అమలవుతున్నాయి. అయితే, వాళ్లంతా జస్ట్​ పేరుకే పరిమితమైపోతున్నారు. భర్తలే పెత్తనమంతా ఎత్తుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం నుంచి గెలిచాక చేసే అభివృద్ధి పనుల వరకూ అన్నీ వాళ్లే చూసుకుంటున్నారు. ఒక్క విషయంలోనూ మహిళలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. ఎన్నికల్లో గెలిచినా తప్పనిసరైతే తప్ప ఆ మహిళా నేతలు బయటకు రాలేకపోతున్నారు. పోయినసారి జరిగిన గ్రేటర్​ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. మొత్తంగా 79 మంది ఆ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలిచారు. మగవాళ్ల కన్నా వాళ్లే ఎక్కువున్నారు. నంబరైతే ఎక్కువే ఉంది కానీ.. వెనకాల పెత్తనం మొత్తం భర్తలు, తండ్రులదే సాగింది. అధికారిక కార్యక్రమాలైనా, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పార్టీ కార్యక్రమాలైనా వాళ్లే వెళుతున్నారు. కొందరు మహిళా కార్పొరేటర్లు ఇందుకు మినహాయింపే అయినా.. ఎక్కువ శాతం మాత్రం మహిళా కార్పొరేటర్లు నామ్​కేవాస్తే మిగిలిపోతున్నారు. ఇటీవల జీడిమెట్లలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో మహిళా కార్పొరేటర్​ భర్త స్టేజీపై కూర్చున్నారు. అయితే, ఆ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్​.. ఆయన్ను నిలదీశారు. ఇలాంటి ఘటనలు ఇంకా ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. ఇక, ఈ ఏడాది కూడా సగం సీట్లు మహిళలకే ఇచ్చారు. మేయర్​ పీఠం కూడా మహిళకే కేటాయించారు.

బరిలో 536 మంది మహిళలు

ప్రస్తుతం గ్రేటర్​ ఎన్నికల్లో 536 మంది మహిళలు పోటీలో నిలిచారు. ప్రధాన పార్టీల నుంచే 232 మంది బరిలో ఉన్నారు. టీఆర్​ఎస్​ నుంచి 84, కాంగ్రెస్​​ నుంచి 75, బీజేపీ నుంచి 73 మంది పోటీ చేస్తున్నారు. మిగతా ఇతర పార్టీలతో పాటు ఇండిపెండెంట్లుగా ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న మహిళా క్యాండిడేట్లకు  సంబంధించి.. 80 శాతం భర్తల హవానే నడుస్తున్నట్టు తెలుస్తోంది. కూతుళ్లు పోటీచేస్తున్న స్థానాల్లో తండ్రులు పెత్తనం చేస్తున్నారని జనం అంటున్నారు.