ఏం ఒరగబెట్టారని ఓట్లు అడగడానికి వస్తున్నరు? .. ప్రచారాన్ని అడ్డుకునేందుకు స్థానికుల యత్నం

ఏం ఒరగబెట్టారని ఓట్లు అడగడానికి వస్తున్నరు? .. ప్రచారాన్ని అడ్డుకునేందుకు స్థానికుల యత్నం
  • హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​కు మళ్లీ నిరసన సెగ
  • డబుల్​ ఇండ్ల కోసం నిలదీత
  • పట్టించుకోకుండా వెళ్లిన బీఆర్ఎస్​ నాయకులు

హుస్నాబాద్, వెలుగు : హుస్నాబాద్  బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ఒడితల సతీశ్ కుమార్ కు మళ్లీ నిరసన సెగ తగిలింది. కొద్దిరోజుల క్రితమే అక్కన్నపేట మండలం మంచినీళ్ల బండలో ఆయనను జనం అడ్డుకోగా శనివారం హుస్నాబాద్  మండలం గాంధీనగర్​లో కూడా స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన మాట్లాడుతుండగా ప్లకార్డులు పట్టుకొని ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్  కార్యకర్తలకు తప్ప గ్రామస్తులకు ఎలాంటి పథకాలు అందలేదని ఆవేదన చెందారు.

ఏం ఒరగబెట్టారని ఓట్లు అడగడానికి వస్తున్నారని నిలదీశారు. ఇండ్లు, భూములు ఉన్నవారికే డబుల్  బెడ్రూం ఇండ్లు, స్కీములు ఇచ్చారని మండిపడ్డారు. ‘‘పదేండ్ల కాలంలో ఒక్కసారి కూడా మీరు (ఎమ్మెల్యే) మా గ్రామానికి రాలేదు. గ్రామంలో ఇండ్లు లేనివారు ఎందరో ఉన్నారు. వారికి డబుల్​బెడ్రూం ఇండ్లు ఎందుకు ఇవ్వలే? రేషన్ కార్డులు, పింఛన్లు, కేసీఆర్​ కిట్ల డబ్బులు కూడా రాలేదు. పోయిన ఎలక్షన్లలో ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ తల్లి వచ్చి గ్రామంలోని పోచమ్మ ఆలయాన్ని డెవలప్​ చేయిస్తానని మాట ఇచ్చినా, ఇప్పటి వరకు ఆ ఊసే లేదు.

గ్రామ సమీపంలోని పాలిటెక్నిక్  కాలేజీ, ఐఓసీ బిల్డింగ్​లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని మోసం చేశారు. బీఆర్ఎస్​ కార్యకర్త ఐదెకరాల భూమి కబ్జా చేసినా ఆయనపై చర్యలు తీసుకోకుండా ఎమ్మెల్యే వెనుకేసుకొస్తున్నాడు” అని స్థానికులు పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేస్తుండడంతో కార్యకర్తలు వారించారు. ఒకవైపు గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎమ్మెల్యే ప్రచారరథం వారిని దాటుకుంటూ ముందుకు వెళ్లిపోయింది.