హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లో 17 అంతస్తుల టవర్లు..బీఆర్ఎస్ హయాంలో ‘ప్రదీప్ కన్స్ట్రక్షన్స్’కు అడ్డదారిన అనుమతులు

హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లో 17 అంతస్తుల టవర్లు..బీఆర్ఎస్ హయాంలో ‘ప్రదీప్ కన్స్ట్రక్షన్స్’కు అడ్డదారిన అనుమతులు
  • హుస్సేన్​ సాగర్​ ఎఫ్​టీఎల్​లో 17 అంతస్తుల టవర్లు
  • బీఆర్ఎస్​ హయాంలో ‘ప్రదీప్​ కన్​స్ట్రక్షన్స్’​కు అడ్డదారిన అనుమతులు 
  • అప్పటి కలెక్టర్, ఇరిగేషన్ ​శాఖ నుంచి ఎన్​వోసీ తీసుకోకుండానే నిర్మాణాలు
  • హైడ్రా, సాగునీటి శాఖ అధికారుల జాయింట్​ సర్వేతో వెలుగులోకి
  • ​జన్వాడ ఫామ్​హౌస్​ ఇష్యూలో క్విడ్ ​ప్రో కోలో భాగమా? అనే చర్చ
  • షోకాజ్ నోటీసు జారీ చేసిన జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దలు హైదరాబాద్​ నడిబొడ్డున తమ అనుయాయుల అక్రమ నిర్మాణాలకు భూసంతర్పణ చేసిన విషయం తాజాగా బయటపడింది. హుస్సేన్​ సాగర్​ ఎఫ్​టీఎల్​ పరిధిలో ఏకంగా 17 అంతస్తుల రెండు భారీ లగ్జరీ టవర్ల నిర్మాణానికి అడ్డదారిలో అనుమతులు ఇచ్చిన విషయం తాజాగా కలకలం రేపుతోంది. అప్పటి కలెక్టర్, ఇరిగేషన్ శాఖల నుంచి ఎలాంటి ఎన్​వోసీలు (నిరభ్యంతర పత్రాలు) లేకపోయినా, సాక్షాత్తూ ‘చెరువులో మునిగిన ఖాళీ భూమి’గా రికార్డుల్లో ఉన్నప్పటికీ మున్సిపల్ శాఖ ప్రత్యేక రాయితీలతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘ప్రదీప్ కన్​స్ట్రక్షన్స్’కు దక్కిన ఈ అసాధారణ అనుమతుల వెనుక.. అప్పట్లో సంచలనం సృష్టించిన ‘జన్వాడ ఫామ్​హౌస్ కేసు’కు సంబంధం ఉందనే అనుమానాలు 
వ్యక్తమవుతున్నాయి. ఇదంతా నాటి ప్రభుత్వంలో నంబర్ ​2గా చక్రం తిప్పిన మంత్రికి, టవర్ల యజమానికి మధ్య క్విడ్​ ప్రో కో (పరస్పర ప్రయోజనాల ఒప్పందం)లో భాగమేనని అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.హైడ్రా, ఇరిగేషన్​అధికారు జాయింట్​ సర్వేలో ఈ అక్రమాల పుట్ట పగలడంతో రంగంలోకి దిగిన జీహెచ్‌‌‌‌ఎంసీ.. సదరు నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది


జాయింట్ సర్వేతో నిగ్గుతేలిన నిజాలు.. 


హైదరాబాద్​నడిబొడ్డున సోమాజిగూడ రాజ్‌‌‌‌భవన్‌‌‌‌ రోడ్డులో ప్రదీప్‌‌‌‌ కన్స్ట్రక్షన్స్‌‌‌‌ ప్రతిపాదించిన 7,640.89 చదరపు మీటర్ల ప్రాజెక్టు స్థలాన్ని ఇటీవల ‘హైడ్రా’, సాగునీటి శాఖ అధికారులు జాయింట్​ సర్వే చేశారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఈ ప్రాజెక్టు స్థలంలో నిర్మాణానికి యోగ్యమైన భూమి ఏమాత్రం లేదు. మొత్తం స్థలంలో 7,355.15 చదరపు మీటర్ల భూమి పూర్తిగా హుస్సేన్‌‌‌‌సాగర్‌‌‌‌ ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ పరిధిలోనే ఉంది. మిగిలిన 285.74 చదరపు మీటర్లు బఫర్‌‌‌‌జోన్‌‌‌‌లో ఉన్నట్లు జాయింట్​ రిపోర్ట్ స్పష్టం చేసింది. టౌన్ సర్వే రికార్డుల ప్రకారం ‘చెరువులో మునిగిన భూమి’గా నమోదైన ఈ స్థలంలో రెండు సెల్లార్లు, స్టిల్ట్‌‌‌‌తో పాటు 17 అంతస్తుల రెండు టవర్లు, ఒక క్లబ్‌‌‌‌హౌస్‌‌‌‌ నిర్మాణానికి పర్మిషన్లు ఇవ్వడం వెనుక అప్పటి మున్సిపల్ శాఖలోని ‘పెద్దల’ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోందని అధికారులు చెప్తున్నారు.


జన్వాడ ఫాంహౌస్‌‌‌‌కు.. దీనికి లింకేంటి?


ఈ అక్రమ అనుమతుల వెనుక భారీ క్విడ్​ప్రో కో ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జన్వాడ, మిర్జాగూడ పరిధిలో అప్పటి ఓ మంత్రికి చెందినదిగా భావించిన వివాదాస్పద ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌ తనదేనని గతంలో నేషనల్ గ్రీన్‌‌‌‌ ట్రిబ్యునల్ (ఎన్​జీటీ ) కేసులో ప్రదీప్‌‌‌‌రెడ్డి కోర్టుకు అఫిడవిట్ సమర్పించిన సంగతి తెలిసిందే. సర్వే నంబర్‌‌‌‌ 311లో 3.30 ఎకరాల భూమితో పాటు 1,210 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌ తనవేనంటూ రిజిస్టర్డ్‌‌‌‌ సేల్‌‌‌‌డీడ్​లు సమర్పించారు. జన్వాడ ఫాంహౌస్ వ్యవహారంలో తెరవెనుక సహకరించినందుకు ప్రతిఫలంగానే.. సోమాజిగూడలోని హుస్సేన్‌‌‌‌సాగర్ ఎఫ్‌‌‌‌టీఎల్ పరిధిలో ప్రదీప్ కన్​స్ట్రక్షన్స్ ప్రాజెక్టుకు నాటి మున్సిపల్ శాఖ మంత్రి ప్రత్యేక రాయితీలతో అనుమతులు కట్టబెట్టారనే చర్చ జోరుగా సాగుతోంది.


‘ఎన్​వోసీ’లు లేవు.. అయినా గ్రీన్ సిగ్నల్!


రాష్ట్ర ఏర్పాటు తర్వాత హుస్సేన్‌‌‌‌సాగర్‌‌‌‌ ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ పరిధిలో మరే ఇతర ప్రైవేటు సంస్థకూ లభించని రీతిలో ప్రదీప్‌‌‌‌ కన్స్ట్రక్షన్స్‌‌‌‌కు అయాచిత లబ్ధి చేకూర్చారు. ఈ ప్రాజెక్టుకు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి గానీ, ఇరిగేషన్ శాఖ నుంచి గానీ ఎలాంటి 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్' (ఎన్​ఓసీ) రాలేదు. అయినా 2018 డిసెంబరు 14న ప్రాథమిక అనుమతులు, ఆ తర్వాత 2020 జనవరి 2న సవరించిన అనుమతులను జీహెచ్‌‌‌‌ఎంసీ చకచకా జారీ చేసేసింది.


జీహెచ్‌‌‌‌ఎంసీ షోకాజ్ నోటీసు..


వాస్తవాలను దాచిపెట్టి, తప్పుడు సమాచారంతో ఈ అనుమతులు పొందినట్లు హైడ్రా సర్వేలో నిర్ధారణ కావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. గతంలో 2018, 2020లలో మంజూరు చేసిన భవన నిర్మాణ అనుమతులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ జీహెచ్‌‌‌‌ఎంసీ ఇప్పటికే సదరు నిర్మాణ సంస్థకు షోకాజ్‌‌‌‌ నోటీసు జారీ చేసింది. కాగా, తీవ్ర వివాదాల నడుమ సాగిన ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌‌‌‌ (ఓసీ) మంజూరు కాలేదని ఉన్నతాధికారులు తెలిపారు. ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ను కబ్జా చేసి కట్టిన ఈ 17 అంతస్తుల టవర్లపై ‘హైడ్రా’తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు హాట్ టాపిక్‌‌‌‌గా మారింది.