పుట్టింటి వేధింపులు భరించలేక.. ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం

పుట్టింటి వేధింపులు భరించలేక.. ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం

పద్మారావునగర్, వెలుగు: కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక ఇద్దరు చిన్నారులతో కలిసి హుస్సేన్ సాగర్​లో ఆత్మహత్యకు యత్నించిన ఓ వివాహితను రాంగోపాల్​పేట పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. జీడిమెట్లకు చెందిన 23 ఏండ్ల బాధితురాలికి రెండేండ్ల కింద భర్త దూరమయ్యాడు. అప్పటినుంచి తన కొడుకు, కుమార్తెతో కలిసి రాంగోపాల్​పేటలోని పుట్టింట్లో ఉంటోంది.

అయితే, తన నడవడికపై అనుమానంతో కన్నవారు, సోదరుడు తనను మానసిక, శారీరక వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వేధింపులు తట్టుకోలేక గురువారం ఉదయం సాగర్ వద్దకు చేరుకోగా, గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ముగ్గురిని రక్షించి స్టేషన్​కు తరలించారు. బాధితురాలికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు హైదరాబాద్​లోని సఖి సెంటర్ కు తరలించినట్లు ఎస్‌‌హెచ్ఓ సురేశ్ కుమార్ తెలిపారు.