హుజూర్​నగర్​.. సాగర్ హామీలు సేమ్ టు సేమ్

హుజూర్​నగర్​.. సాగర్ హామీలు  సేమ్ టు సేమ్
  • హామీలు, వరాలు సేమ్​ టు సేమ్
  • అప్పుడు హుజూర్​నగర్​లో చెప్పినవే.. ఇప్పుడు సాగర్​లోనూ చెప్పిన కేసీఆర్​
  • ఏడాది గడిచినా హుజూర్​నగర్​కు నిధులు​ రాలె.. పనులు కాలె
  • జీవోలు తప్ప ఫండ్స్​, పనులపై క్లారిటీ లేదంటున్న ఆఫీసర్లు

హుజూర్​నగర్ సభలో 26 అక్టోబర్, 2019

హుజూర్​నగర్​ నియోజకవర్గంలోని 134 గ్రామ పంచాయతీలకు రూ. 20 లక్షల చొప్పున ఇస్త.

7 మండల కేంద్రాలకు రూ.30 లక్షల చొప్పున రూ. 2.10 కోట్లు.

హుజూర్​నగర్ ​మున్సిపాలిటీకి సీఎం ఫండ్స్​ నుంచి రూ. 25 కోట్లు.

నేరేడుచర్ల మున్సిపాలిటికీ రూ. 15 కోట్లు.

కృష్ణపట్టిలో కుర్చీ వేసుకొని కూర్చొని అయినా సరే ప్రతి ఎకరాకు నీళ్లిస్తం.

హాలియా సభలో 10 ఫిబ్రవరి, 2021

నల్గొండ జిల్లాలోని 844 గ్రామ పంచాయతీలకు రూ. 20 లక్షల చొప్పున ఇస్త.

31 మండల కేంద్రాలకు రూ. 30 లక్షల చొప్పున రూ. 9.30 కోట్లు.

నల్గొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు.

మిర్యాలగూడ మున్సిపాలిటీకి రూ. 5 కోట్లు.

మిగిలిన ఆరు మున్సిపాలిటీలకు రూ. కోటి చొప్పున రూ. 6 కోట్లు.

కుర్చీ వేసుకొని కూర్చొని అయినా సరే, నాగార్జున సాగర్​ ఎడమకాలువ కింద చివరి ఆయకట్టుకు నీళ్లందిస్తం.

నల్గొండ, వెలుగు: పంచాయతీలకు, మండలాలకు, మున్సిపాలిటీలకు, దానికీ దీనికీ అంటూ 2019లో హుజూర్​నగర్​ బై ఎలక్షన్​ కృతజ్ఞత సభలో ఏ హామీలైతే ఇచ్చారో, ఏ వరాలైతే ప్రకటించారో.. ఇప్పుడు నాగార్జున సాగర్​ బై ఎలక్షన్​ సందర్భంగానూ అవే హామీలు, అవే వరాలు ప్రకటించారు సీఎం కేసీఆర్​.  ఒక్కో పంచాయతీకి రూ. 20 లక్షల చొప్పున ఇస్తామని హుజూర్​నగర్​ సభలో చెప్పిన సీఎం.. ఇప్పుడు హాలియా సభలోనూ అట్లనే రూ. 20 లక్షల చొప్పున ఇస్తామన్నారు. మండల కేంద్రాలకు, మున్సిపాలిటీలకూ స్పెషల్​ ఫండ్స్​ ఇస్తామని చెప్పారు. కుర్చీ వేసుకొని కూర్చొనైనా సరే ఆయకట్టుకు నీళ్లందిస్తామన్నారు. ఈ మీటింగ్​ను, ఆ మీటింగ్​ను పబ్లిక్, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు కంపేర్​ చేసుకుంటున్నారు.  ఏడాది కింద హుజూర్​నగర్​ సభలో ప్రకటించిన హామీలు ఇప్పటికీ అమలు కావడం లేదని,  జీవోలు తప్ప ఒక్క పైసా కూడా విడుదల కాలేదని అంటున్నారు. సోషల్​ మీడియాలోనూ నాటి, నేటి హామీల మీదే హాట్​హాట్​ చర్చ నడుస్తున్నది.

హుజూర్​నగర్  సభలో చెప్పిందేందంటే..!

2019  అక్టోబర్ 17న హుజూర్​నగర్​లో కేసీఆర్  బహిరంగ సభ ఏర్పాటు చేయగా.. వర్షం కారణంగా రద్దయింది. అదే నెల 24న వెల్లడైన ఫలితాల్లో టీఆర్​ఎస్​ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపొందగా, 26న సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఆ విజయం తెచ్చిన ఉత్సాహంలో సీఎం కేసీఆర్​హుజూర్​నగర్​నియోజకవర్గంపై పలు వరాలు కురిపించారు. నియోజకవర్గంలోని 134 గ్రామపంచాయతీలకు రూ. 20 లక్షల చొప్పున రూ. 26.80 కోట్లు, ఏడు మండల కేంద్రాలకు రూ. 30 లక్షల చొప్పున  రూ. 2.10 కోట్లు, హుజూర్​నగర్​మున్సిపాలిటీకి సీఎం ఫండ్స్​ నుంచి రూ. 25 కోట్లు, నేరేడుచర్ల  మున్సిపాలిటికీ రూ. 15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యాపేట జిల్లాలో పరిశుభ్రమైన నగరం ఏదయ్యా అంటే హుజూర్​నగర్​అని చెప్పేలా తీర్చిదిద్దుతామని సీఎం హామీ ఇచ్చారు. ఇంకా హుజూర్​నగర్​కు ట్రైబర్​ రెసిడెన్షియల్​ స్కూల్​, బంజారా భవన్​, ఈఎస్​ఐ హాస్పిటల్, పాలిటెక్నిక్​కాలేజీ మంజూరు చేస్తున్నట్లు  ప్రకటించారు. అలాగే  ప్రజాదర్బార్​ పెట్టి, మంత్రుల సమక్షంలో పోడుభూముల సమస్య పరిష్కరిస్తామన్నారు. ఏడాది తిరిగింది. ఏ పంచాయతీకి గానీ, ఏ మండల కేంద్రానికి గానీ, ఏ మున్సిపాలిటీకి గానీ పైసా ఫండ్స్​ రాలేదు. ట్రైబల్‌​ రెసిడెన్షియల్​ స్కూల్​, బంజారా భవన్​, ఈఎస్​ఐ హాస్పిటల్, పాలిటెక్నిక్​ కాలేజీ ఊసేలేదు. పోడు భూముల సమస్య పరిష్కారం కాలేదు. అదేమంటే.. జిల్లా మంత్రి, ఎమ్మెల్యే చెప్తే తప్ప పనులు స్టార్ట్ చేయలేమని ఇంజనీరింగ్ ఆఫీసర్లు సైలెంట్ అయ్యారు. ఫండ్స్​ రాలేదని మంత్రి, ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇక సారు చెప్పిన ఫండ్స్  ఎప్పుడొస్తాయా అని సర్పంచులు, ఎంపీపీలు, పబ్లిక్​ ఎదురుచూస్తూనే
ఉన్నారు.

ఇప్పుడు సాగర్​ బై ఎలక్షన్​ సందర్భంగా..

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నర్సింహయ్య చనిపోవడంతో త్వరలో బై ఎలక్షన్​ జరుగనుంది. కానీ మొన్న జరిగిన దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో టీఆర్​ఎస్​కు గట్టి ఎదురుదెబ్బ తగలడంతో సాగర్​లో ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 10న నల్గొండ జిల్లా హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో నూ అప్పట్లో హుజూర్​నగర్​ సభలో ఇచ్చిన లాంటి హామీలే ఇచ్చారు. కాకపోతే అప్పుడు హుజూర్​నగర్​ నియోజకవర్గంపైనే  ఫోకస్​ పెట్టిన ఆయన, ఇప్పుడు నల్గొండ జిల్లాకు విస్తరించారు. జిల్లాలోని 844 జీపీలకు రూ.  20 లక్షల చొప్పున, 31మండల కేంద్రాలకు రూ. 30 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు  ప్రకటించారు. జిల్లా కేంద్రంగా ఉన్న నల్గొండ  మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ. 10 కోట్లు శాంక్షన్​ చేస్తామన్నారు. జిల్లాలో మరో పెద్ద మున్సిపాలిటీ అయిన మిర్యాలగూడకు రూ. 5 కోట్లు, మిగిలిన ఆరు మున్సిపాలిటీలకు రూ. కోటి చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ‘ఇందుకోసం మొత్తం రూ. 186 కోట్లు అవసరమవుతాయి. రేపే జీవోలు ఇస్తం” అని చెప్పారు. ఇక ఎప్పట్లాగే తన స్టయిల్​లో.. కుర్చీ ఏసుకొని కూర్చొని అయినా సరే నాగార్జునసాగర్​ ఎడమకాలువ కింద చివరి ఆయకట్టుకు నీళ్లందించే బాధ్యత తనదేననని సీఎం అన్నారు. దీంతో నాడు హుజూర్​నగర్​లో ఇచ్చిన హామీలే తాజాగా నాగార్జునసాగర్​ బై ఎలక్షన్​ సందర్భంగానూ సీఎం ప్రకటించిన తీరును చూసి పబ్లిక్​, సర్పంచులు, మండల ప్రజాప్రతినిధులు నివ్వెరపోతున్నారు.  అప్పటి హామీలు ఇంకా అమలుకాలేదని, ఇక నల్గొండ జిల్లాకు ఫండ్స్​ వస్తాయని ఆశించడం అత్యాశేనని చర్చించుకుంటున్నారు.

ఇప్పటికీ గైడ్​లైన్స్​ రాలె

2019లో సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీ మేరకు హుజూర్​నగర్​ నియోజకవర్గంలోని 134  గ్రామపంచాయతీలకు రూ. 20 లక్షల చొప్పున శాంక్షన్​ చేస్తున్నట్లు  జీవోలు వచ్చా యి. కానీ ఇప్పటికీ ఫండ్స్​ రాలేదు. అసలు ఆ ఫండ్స్​ కింద పంచాయతీల్లో పనులు ఎవరు చేయాలి? అనే విషయంలోనే ఇంకా క్లారిటీ రాలేదు. ఇందుకు సంబంధించి  గైడ్ లైన్స్ రావాల్సి ఉంది. ఆ గైడ్​లైన్స్​ ఎప్పుడు ఇస్తారో, ఇందుకు ఇంకెంత టైం పడుతుందో మాకు తెలియదు.

– వెంకటయ్య, డీఈ పీఆర్, హుజూర్​నగర్.

హుజూర్​గర్ సభలో అక్టోబర్ 26 , 2019

హుజూర్​నగర్​కు ట్రైబర్​ రెసిడెన్షియల్​ స్కూల్​, బంజారా భవన్​, ఈఎస్​ఐ హాస్పిటల్, పాలిటెక్నిక్ ​కాలేజీ మంజూరు.

హుజూర్​నగర్​కు రింగ్ రోడ్డు, సుందరమైన ట్యాంకుబండ్​ నిర్మిస్తం.

హాలియా మండల కేంద్రంలో డిగ్రీ కాలేజ్​ ఏర్పాటు.

మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల కోర్టు పరిధిని హైకోర్టు చీఫ్ జస్టిస్ తో మాట్లాడి కోదాడ నుంచి హుజూర్​నగర్​ తరలింపు.

ప్రజాదర్బార్​ పెట్టి, మంత్రుల సమక్షంలో పోడుభూముల సమస్యకు పరిష్కారం.

ఆగిపోయిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పేదలకు పట్టాలు ఇచ్చి  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తం.

కాలువ కట్ట పక్కన నివసిస్తున్న పేదలందరికీ  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తం.

కెనాల్స్​ వెంట అప్రోచ్ రోడ్లు , డిస్ట్రిబ్యూటరీ కెనాల్, మేజర్ కాలువ రిపేర్లు, లైనింగ్ ను రూ. 100 కోట్లతో పూర్తి చేస్తం.

హాలియా సభలో ఫిబ్రవరి10, 2021

నెల్లికల్లు, బరాఖత్​ గూడెం,  ముక్త్యాల బ్రాంచ్ కెనా ల్, వెల్లటూరు, చింతలపాలెం, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, జాన్ పహాడ్ బ్రాంచ్ కెనాల్, ఎస్ఎల్​బీసీ లైనింగ్, బొత్తల పాలెం వాడపల్లి, దున్నపోతుల గండి, కేశవాపురం కొండ్రప్రోలు, దేవరకొండలో పొగిళ్ల, కంబాల పల్లి, అంబాభవాని అండ్ వైజాగ్​కాలనీ, పెద్దగట్టు, అంగడిపేటకు రూ. 2,500 కోట్లతో లిఫ్ట్ స్కీంలు.

మాడ్గులపల్లి మండలంలో వీర్లపాలెం, తోపుచర్ల లిఫ్టు మూడు రోజుల్లో మంజూరు.

నెల్లికల్లు లిఫ్ట్​కు కింద వివాదంలో ఉన్న భూములకు రెండు, మూడు రోజుల్లో పట్టాలు ఇచ్చేలా చర్యలు.

ఖమ్మం జిల్లాలోని సీతారామా ప్రాజెక్టు ద్వారా పాలేరు రిజర్వాయర్  ద్వారా దిగువన దేవులపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్​కు నీళ్లు

గోదావరి నీళ్లను కూడా పెద్దదేవులపల్లికి తీసుకొచ్చి  నల్గొండ జిల్లా ప్రజల కాళ్లు కడుగుత.

ఒక్క హామీ నెరవేరలె

ప్రతి ఊరుకు రూ. 20లక్షలు, మండల కేంద్రానికి రూ. 30 లక్షలు ఇస్తామని హుజూర్​నగర్​ సభలో సీఎం చెప్పి ఏడాది గడిచింది. ఇప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేరలేదు. ఇలాంటి హామీల వల్ల ప్రజలు మమ్ముల నిలదీయడం తప్ప లాభం లేదు.

– నేనావత్ కవిత, ఎంపీటీసీ, శూన్యం పహాడ్ తండా, హుజూర్​నగర్​

ప్రజల్ని మోసం చేస్తున్నరు

ఎక్కడ  ఉప ఎన్నికలు జరిగినా సభ పెట్టడం, ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇవ్వటం, తర్వాత వాటిని నెరేవేర్చకపోవడం సీఎం కేసీఆర్ కు అలవాటైంది. హుజూర్ నగర్  మీటింగ్​లో  నేరేడుచర్ల మున్సిపాల్టీకి రూ. 15 కోట్లు శాంక్షన్​ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏడాది గడిచిపోయినా ఒక్క రూపాయి కూడా రిలీజ్​ చేయలేదు. ఉత్తుత్తి  జీవోలు విడుదల చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నరు. ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక రావటంతో మళ్లీ అలాంటి హామీలే ఇస్తున్నరు.

– కొణతం చిన్న వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, నేరేడుచర్ల

ప్రతిసారీ ఇవే మాటలు

రాష్ట్రంలో ఎన్నికలు జరిగినపప్పుడల్లా ప్రతి ఊరుకు  రూ. 20 లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్​ పబ్లిక్​ను మోసం చేస్తున్నరు.  ఓట్లు వేయించుకొని గెలిచాక ఆ హామీలను పట్టించుకుంటలేడు. 2019లో హుజూర్​నగర్​లో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలుచేయలేదు. గొప్పలకు పోయి కోట్లకు కోట్ల హామీలివ్వడం ఎందుకు? ఆ తర్వాత వదిలేయడం ఎందుకు? ప్రజలు అన్నీ గమనిస్తున్నరు.

– పోకల వెంకటేశ్వర్లు, బీజేపీ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు, గరిడేపల్లి

మా ఊరికి పైసా రాలె..

హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్​ఎస్​ గెలిచాక  నిర్వహించిన బహిరంగ సభలో ప్రతి పంచాయతీకి రూ. 20లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన్రు. కానీ ఇప్పటివరకు ఆ 20 లక్షలు రాలేదు. పైసలు వస్తే ఊరిలో వివిధ డెవలప్​మెంట్​పనులు చేసుకుందామని భావించినం. పబ్లిక్​ఏమో ‘‘సీఎం పైసలిస్తననెగద.. ఇయ్యలేదా?..’’ అని అడుగుతున్నరు.  జీవోలు ఇచ్చారని ఆఫీసర్లు చెబుతున్నరు. కానీ పైసలు రానప్పుడు ఆ జీవోలతో ఏం లాభం? హుజూర్ నగర్  బెట్టం తండా లిఫ్ట్ ఇరిగేషన్ కు 2018లోనే  కృష్ణ రివర్ బోర్డ్ పర్మిషన్ ఇచ్చింది. కానీ  నేటికీ రాష్ట్ర సర్కారు ఫండ్స్ శాంక్షన్​ చేయలేదు.

–  మోతీలాల్,  సర్పంచ్​, బెట్టం తండా, పాలకీడు మండలం.