హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ లైవ్ అప్డేట్స్

హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ లైవ్ అప్డేట్స్

హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ లైవ్ అప్డేట్స్

 

  • హుజురాబాద్ ఉప ఎన్నికకు ముగిసిన పోలింగ్
  •  86.40 శాతం పోలింగ్ నమోదు


హుజురాబాద్ ఉప ఎన్నిక  ముగిసింది. సాయంత్రం 7 గంటల వరకు కొనసాగిన పోలింగ్ లో  ప్రస్తుతానికి 86.40 శాతం నమోదైనట్లు  ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగిన హుజురాబాద్ ఉప ఎన్నిక.. చిన్న చిన్న ఘటనలు  మినహా..ప్రశాంతంగా ముగిసింది. అయితే క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంల కు సీల్ చేశారు ఎన్నికల సిబ్బంది. ఆ తర్వాత ఈవీఎంలను కరీంనగర్ జిల్లాలోని SRR కాలేజీకి తరలించారు అధికారులు.నవంబర్ 2న కౌంటింగ్ జరగనుంది.

  • చివరి దశకు చేరుకున్న పోలింగ్

హుజురాబాద్ పోలింగ్ చివరి దశకు చేరకుంది. రాత్రి 7గంటల వరకు పోలింగ్ జరగనుంది. చివరి గంటలో కరోనా పేషెంట్లు ఓటు వేయనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 76 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.

  • చివరి గంటలోనూ ఆగని ప్రలోభాలు

హుజూరాబాద్‎ ఉపఎన్నికలో చివరి గంటలోనూ ప్రలోభాలు ఆగలేదు. మరో గంట మాత్రమే సమయమున్నా నోట్ల పంపిణీ మాత్రం జరుగుతూనే ఉంది. సీల్డ్ కవర్లలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. కమలాపూర్ కు దగ్గర్లోని ఓ రహస్య ప్రదేశంలో టీఆర్ఎస్ నేతలు కారులో వచ్చి డబ్బులు పంపిణీ చేస్తున్నారని బీజేపీ నేతలు గుర్తించారు. కారులో 500 రూపాయల నోట్ల కట్టలను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులకు సమాచారమందడంతో.. డబ్బులు పంచుతున్నవారిని అదుపులోకి తీసుకున్నారు.

  • సాయంత్రం 5 గంటల వరకు 76 శాతం పోలింగ్

హుజూరాబాద్‎లో ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు హుజూరాబాద్‎లో 76.26 శాతం పోలింగ్ అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. చివరి రెండు గంటల్లో 14.6 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీ సంఖ్యలో బారులు తీరి ఉన్నారు.

  • ఎన్నికల అనంతరం కూడా చర్యలు తీసుకుంటాం: సీఈసీ శశాంక్ గోయల్

హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నిక తీరును రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ పరిశీలించారు. కమలాపూర్‎లోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఆయన.. నియోజకవర్గంలోని 306 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు. ఇప్పటివరకు 88 ఫిర్యాదులు అందాయని.. వాటిపై అబ్జర్వర్స్ వివరాలు సేకరిస్తున్నారని ఆయన తెలిపారు. డబ్బుల పంపిణీపై అందిన ఫిర్యాదులను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని గోయల్ చెప్పారు. ఓటర్లు చాలా ఉత్సాహంగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. ఫిర్యాదులపై విచారణలో నిజాలు తేలితే ఎన్నికల అనంతరం కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  • లిస్ట్ తీసి మరి డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ సర్పంచ్

హుజూరాబాద్ లో ఉపఎన్నిక పోలింగ్ జరుగుతుంది. అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినా.. పోలింగ్ మాత్రం ఎక్కడా ఆగలేదు. కాగా.. ఈ ఉపఎన్నిక కోసం పార్టీలు మాత్రం భారీగా డబ్బులు ఖర్చుచేస్తున్నాయి. కమలాపురం మండలము గూడూరు సర్పంచు ఎవరెవరికీ డబ్బులు ఇవ్వాలో వారిని లిస్టుగా తయారుచేసి డబ్బులు పంచుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

  • ఓటేయాలంటూ హరీశ్ రావు కాన్ఫరెన్స్ కాల్

కమలాపూర్ మండలంలోని ఓటర్లకు హరీష్ రావు కాన్ఫరెన్స్ కాల్ చేసి మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ కు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • డబ్బుల కోసం టీఆర్ఎస్ సర్పంచ్ ఇంటిముందు భారీ క్యూ

హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో టీఆర్ఎస్ సర్పంచ్ ఇంటి ముందు ఓటర్లు బారులు తీరారు. ఓటేయడానికి వచ్చిన వారికి డబ్బులు ఇస్తుండటంతో ఆయన ఇంటి గేటు ముందు ప్రజలు భారీ సంఖ్యలో నిలుచున్నారు.

  • మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.  మధ్యాహ్నం 3 గంటల వరకు 61.66 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.

  • ఈటల రాజేందర్ కాన్వాయ్‎కు చెందిన మూడు కార్లు సీజ్

బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కాన్వాయ్‎కు చెందిన మూడు వాహనాలను సీజ్ చేశారు. కమలాపూర్ మండలం మరిపెల్లి గూడెంలో వాహనాలకు అనుమతిలేదని ఈటలకు చెందిన మూడు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అదేవిధంగా ఈటల రాజేందర్ పీఆర్వోను కూడా అదుపులోకి తీసుకున్నారు.

  • డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పీఏ

టీఆర్ఎస్ ఎమ్మెల్యే (వర్ధన్నపేట) ఆరూరి రమేష్ పీఏ కిరణ్‎ డబ్బులు పంచుతుండగా బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నారు. హుజురాబాద్ 51వ పోలింగ్ బూత్ పరిధిలో డబ్బులు పంచుతున్నారని టీఆర్ఎస్ నేతలను బీజేపీ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

  • కౌన్సిలర్ ఇంట్లో ఎమ్మెల్యే! సోదా చేసిన సీపీ

జమ్మికుంటలో టీఆర్ఎస్ కౌన్సిలర్ దీప్తి ఇంటిముందు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆమె ఇంటి దగ్గర ముగ్గురు నాన్ లోకల్ టీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 28వ వార్డు కౌన్సిలర్ దీప్తి ఇంటి దగ్గర దొంగ ఓట్లు వేసేవారికి డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆమె ఇంటి ముందు బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఆమె ఇంటి పెంట్ హౌస్‎లో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఉన్నాడని బీజేపీ నేతలు ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మాటల యుద్ధం పెరగడంతో.. సీపీ సత్యనారాయణ అక్కడకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఆ ఇంట్లో ఎవరూ లేరని సీపీ స్పష్టం చేశారు. ఏ ఎమ్మెల్యే లేడని, ఎటువంటి డబ్బులు లేవని ఆయన చెప్పారు. ఇద్దరు మీడియా ప్రతినిధులను ఇంట్లోకి తీసుకెళ్లి ఇల్లు మొత్తం చూపించారు.

  • మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన పోలింగ్ శాతం

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.  మధ్యాహ్నం 1 గంట వరకు 45.63 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఉదయం మందకోడిగా సాగిన పోలింగ్.. మధ్యాహ్నానికి ఊపందుకుంది.

హుజూరాబాద్ మండలంలో 45.05 శాతం పోలింగ్
వీణవంక మండలంలో 47.65 శాతం పోలింగ్
జమ్మికుంట మండలంలో 45.36 శాతం పోలింగ్
కమలాపూర్ మండలంలో 46.76 శాతం పోలింగ్
ఇల్లందకుంట మండలంలో 42.09 శాతం పోలింగ్

  • డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ నేతలను పట్టుకున్న పోలీసులు

హుజురాబాద్ లో డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ నేతలను పోలీసులు పట్టుకున్నారు. మార్కెట్ ఏరియాలో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని పోలీసులకు బీజేపీ కార్యకర్తలు సమాచారమివ్వడంతో.. అక్కడికెళ్లిన పోలీసులు వారిని పట్టుకొని సుమారు రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

  • ఎస్ఐ సార్ కి మేమే పింక్ డ్రెస్ తొడిగిస్తాం

ఎన్నిక తీరును పరిశీలించడానికి హిమ్మత్ నగర్ వెళ్లిన బీజేపీ నాయకురాలు తుల ఉమను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలతో గొడవకు దిగారు. పోలీసులు కూడా బీజేపీ కార్యకర్తలను మాత్రమే దూరంగా పంపిస్తున్నారని మండిపడుతున్నారు. పోలీసులు టీఆర్ఎస్ బట్టులు వేసుకొని ప్రచారం చేయండని ఓ వృద్దుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

డ్యూటికొచ్చిన ఎస్ఐ టీఆర్ఎస్ కార్యకర్తలను ఏమీ అనకుండా బీజేపీ వాళ్లను తరుముతున్నాడని బీజేపీకి చెందిన ఓ యువతి మండిపడింది. ఆ ఎస్ఐ ఖాకీ డ్రెస్ ఇప్పేసి పింక్ డ్రెస్ వేసుకుంటాడా అని ప్రశ్నించింది. టీఆర్ఎస్ వాళ్లకో న్యాయం.. మాకో న్యాయమా అని ప్రశ్నించింది. మా కార్యకర్తల మీద టీఆర్ఎస్ వాళ్లు చేయి చేసుకున్నారని.. వాళ్ల మీద పోలీసులు చర్య తీసుకోకపోతే.. ఎస్ఐ సార్ కి మేమే పింక్ డ్రెస్ తొడిగిస్తామని చెప్పుకొచ్చింది.

  • బీజేపీ నేత తుల ఉమను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు

టీఆర్ఎస్ అభ్యర్థి సొంత గ్రామమైన హిమ్మత్ నగర్‎లో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్నిక తీరును పరిశీలించడానికి వెళ్లిన బీజేపీ నాయకురాలు తుల ఉమను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. తుల ఉమను టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భార్య అడ్డుకుంది. తుల ఉమకు ఇక్కడ ఓటు లేదు కదా.. మరి ఆమె ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. నాన్ లోకల్స్ ఎందుకు వస్తున్నారని టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. తుల ఉమ రావడంవల్లే హిమ్మత్ నగర్ లో గొడవ మొదలైందని వారు మండిపడుతున్నారు. కాగా.. హిమ్మత్ నగర్ లో ఓటుకు ఆరు వేలు పంచారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. 

  • కౌశిక్ రెడ్డి అడ్డగింతపై స్పందించని గెల్లు శ్రీనివాస్

ఓటు వినియోగించుకున్న తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కౌశిక్ రెడ్డిని పలు గ్రామాలలో బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై ఆయనను మీడియా ప్రశ్నిస్తే.. ఏ మాత్రం స్పందించకుండా గెల్లు అక్కడినుంచి వెళ్లిపోయారు.

  • ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్

హుజూరాబాద్ లో ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తన ఓటు హక్కును హిమ్మత్ నగర్ లో వినియోగించుకున్నారు. మార్పుకు హుజూరాబాద్ నాంది కావాలని ఆయన అన్నారు. ఆయన తన స్వగ్రామమైన హిమ్మత్ నగర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లందరూ స్వచ్ఛందంగా బయటకొచ్చి ఓటేయాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే ఆయుధమని ఆయన అన్నారు. పోలింగ్ శాతం పెరగాలని ఆయన ప్రజలను కోరారు.

  • డబ్బులిస్తేనే ఓటేస్తామంటూ సర్పంచ్ ఇంటిముందు నిరసన

ఒకపక్క హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ జరుగుతుంటే.. మరోపక్క తమకు డబ్బులిస్తేనే ఓటేస్తామని జమ్మికుంట మండలం రాచపల్లి గ్రామస్తులు సర్పంచ్ ఇంటిముందు నిరసన తెలుపుతున్నారు. గ్రామంలో కొందరికి మాత్రమే డబ్బులు పంపిణీ చేశారని.. తమకు కూడా డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తామని కొంతమంది ఓటర్లు నిరసన తెలిపారు. దాంతో పోలీసుల సహకారంతో సర్పంచ్ నిరసనకు దిగిన ఓటర్లను వెనక్కి పంపించారు.

  • కౌన్సిలర్ ఇంట్లో డబ్బుల పంపిణీ!

కరీంనగర్ జిల్లా, జమ్మికుంట పట్టణంలోని 28వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ దీప్తి ఇంటి దగ్గర దొంగ ఓట్లు వేసేవారికి డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో ఆమె ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.

  • ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం పోలింగ్

హుజూరాబాద్ ఉపఎన్నిక కొనసాగుతోంది. అయితే ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

  • పోలీసులు డబ్బు పంచారనడం నిరాధారం: సీపీ

హుజూరాబాద్ లో ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతుందని సీపీ సత్యనారాయణ అన్నారు. ఇప్పటివరకు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆయన అన్నారు. ‘పోలీసులు డబ్బు పంచారనడం నిరాధార ఆరోపణలు, అవాస్తవాలని సీపీ సత్యనారాయణ చెప్పారు. ఇప్పటివరకు రూ. 3.5 కోట్లు సీజ్ చేశాం. డబ్బులు పంచుతున్నారని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి కానీ మాకు మాత్రం ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. ఇప్పటివరకు ఓటర్లకు డబ్బులు ఆఫర్ చేసినోళ్ల మీద మూడు కేసులు, తీసుకున్నోళ్ల మీద రెండు కేసులు పెట్టాం. ఆఫర్ చేయడం ఎంత నేరమో, తీసుకోవడమూ అంతే నేరం’ అని సీపీ అన్నారు.

  • మార్కెట్ కమిటీ చైర్మన్  ఇంట్లో డబ్బులు పంపిణి

హుజురాబాద్ బైపోల్ లో ప్రలోభాలు కొనసాగుతున్నాయి. ఓటింగ్ కు ముందు కూడా  టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాలకిషన్ రావు ఇంట్లో డబ్బులు పంపిణి చేస్తున్నారని బిజేపి,టీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు వచ్చి వారిని వారించారు. డబ్బులు  పంచుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్న టీఆర్ఎస్ నాయకున్ని బీజేపీ కార్యకర్తలు పోలీసులకు పట్టించారు.

  • హుజూరాబాద్ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి హల్‎చల్

హుజూరాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి హల్‎చల్ చేస్తున్నారు. తాను పోలింగ్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అని, తాను ఎక్కడైనా తిరుగొచ్చంటూ అన్ని పోలింగ్ కేంద్రాలలో తిరుగుతున్నాడు. తన అనుచరులతో గుంపుగా వచ్చి అడ్డుకున్నవారిని తిడుతూ.. టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే గన్ముక్లలో ఆయనను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తాజాగా వీణవంక మండల కేంద్రంలోని హైస్కూల్ లో కూడా ఆయనను అడ్డుకున్నారు. ఎలక్షన్ ఏజెంట్ అయితే ప్రచారం ఎందుకు చేస్తున్నావంటూ బీజేపీ నేతలు నిలదీస్తున్నారు.

  • మీడియా కార్డులతో డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ నేతలు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శాయంపేటలో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతుండగా బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నారు. ఓ న్యూస్ చానల్ కు చెందిన ఫేక్ ఐడీ కార్డులతో టీఆర్ఎస్ నేతలు తిరుగుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. సదరు న్యూస్ చానల్‎కు చెందిన ఐడీ కార్డులను బీజేపీ నేతలు మీడియా ముందు ప్రదర్శించారు. మీడియా కార్డుతో తిరుగుతున్న ఆ వ్యక్తిని వరంగల్ కు చెందిన రిపోర్టర్ దేవేందర్ రెడ్డి గుర్తించారు. ఆయన ఓ ప్రముఖ దినపత్రికలో పనిచేస్తున్నారని తెలుస్తోంది. కాగా.. ఆ రిపోర్టర్ జేబులో భారీ ఎత్తున నగదు ఉండడంతో బీజేపీ నేతలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

  • ఈటలకు ఓటేస్తామని ఓటు తీసేశారు

కావాలనే మా ఓట్లు తీసేశారని కమలాపూర్ కు చెందిన వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ‘గతంలో సర్పంచ్, ఎమ్మెల్యే ఎన్నికలకు ఎన్నోసార్లు ఓటేశాం. అయితే మేం ఈటల రాజేందర్ కు ఓటేస్తామని మా ఆలుమగల ఓట్లు తీసేశారు. మాకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు రాకున్నా బాధలేదు కానీ, ఓటు వేయనందుకు బాధపడుతున్నాం. ఓటు వేయకపోవడంతో చచ్చినవాళ్లతో సమానం అయినం. నా ఓటు నాకు కావాలి’ అని ఆమె డిమాండ్ చేస్తోంది.

  • హుజురాబాద్ కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి

హుజూరాబాద్ టౌన్‎లోని ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్‎ను మరికాసేపట్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్  పరిశీలించనున్నారు.

  • ఉదయం 10 గంటల వరకు 10.5 శాతం ఓటింగ్

హుజూరాబాద్ ఉపఎన్నికకు సంబంధించి ఉదయం 10 గంటల వరకు 10.5 శాతం ఓటింగ్ నమోదైనట్లు సమాచారం. కాగా.. ఇల్లందకుంటలో ఈవీఎంలు మొరాయించడంతో 8.5 శాతం నమోదైనట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఇప్పటివరకు మహిళలు, వృద్ధులు ఎక్కువగా తమ ఓట్లను వినియోగించుకున్నారు. అయితే యువత మాత్రం ఇంకా పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేదని తెలుస్తోంది.

  • నాయకులు ప్రలోభాలకు గురవుతారు కానీ ప్రజలు కారు: ఈటల

పిడికెడు నాయకులు ప్రలోభాలకు గురవుతారు కానీ ప్రజలు కారని ఈటల అన్నారు. కేసీఆర్ అందర్నీ కొనుగోలు చేసి కోవర్టుగా చేసుకుంటున్నరని ఈటల అన్నారు. ప్రేమాభిమానం ముందు డబ్బులు, మద్యం పని చేయవన్నారు. ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు అంటే మంచికి సంకేతమని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ నిశ్చేష్టం అయ్యిందని.. ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకోవాలని ఈటల అన్నారు. సాయంత్రానికల్లా 90 శాతం పోలింగ్ అవుతుందనుకుంటున్నానని ఈటల అన్నారు. హజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‎కు ఓటు వేయకపోతే పెన్షన్లు, దళితబంధు, రైతుబంధు, కళ్యాణలక్ష్మి మొదలైనవి రావని టీఆర్ఎస్ నేతలు అంటున్నారని.. పెన్షన్లు ఏమైనా కేసీఆర్ తన ఇంట్లోంచి ఇస్తున్నాడా అని ఈటల ప్రశ్నించారు. కాగా.. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం ఒకవైపు ఉంటే.. ప్రజలంతా మరోవైపు ఉన్నారని ఈటల జమున అన్నారు.

  • కౌశిక్ ను తరిమిన గ్రామస్తులు

వీణవంక మండలం గన్ముక్ల గ్రామంలో పోలింగ్ కేంద్రం దగ్గర తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలింగ్ తీరును పరిశీలించడానికి వెళ్లిన టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. జై ఈటల అంటూ నినాదాలు చేశారు. ఓటర్లంతా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డిని పోలింగ్ కేంద్రం నుంచి బయటి వరకు తరిమారు. పోలింగ్ సెంటర్‎కు ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించారు. దాంతో కౌశిక్ రెడ్డి పోలింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు.

  • ఓటేసిన ఈటల దంపతులు

బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలాపూర్‌ 262 పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు.

  • ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

హుజురాబాద్ లో కాసేపట్లో  ఓటేయనున్నారు బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్. భార్య జమునతో కలిసి.. కమలాపూర్ లోని 262 పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. హుజురాబాద్ మండలం.. కందుగుల ZP హైస్కూల్ లో ఓటింగ్ సరళిని పరిశీలించారు ఈటల. ఉప్పలపల్లిలోని పోలింగ్ బూత్ ను కూడా పరిశీలించారు ఈటెల. ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

  • పోలింగ్ సెంటర్ పక్క వీధిలోనే టీఆర్ఎస్ ఇంచార్జులు..

జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ  కాలేజీ సెంటర్ లో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతుండగా అడ్డుకున్నారు బీజేపీ నాయకులు. టీఆర్ఎస్ ఇంచార్జులు అక్కడే ఉండి డబ్బులు పంపిణీ చేయడంపై మండిపడ్డారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. ఒకరిని ఒకరు తోసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

  • ఈవీఎంల మెరాయింపు :  ప్రలోభాలకు గురిచేస్తున్న టీఆర్ఎస్ నేత

హుజురాబాద్ ఉప ఎన్నికకు బై పోల్ 7 గంటలకే ప్రారంభం కాగా..  హుజురాబాద్ లోని ఇల్లందకుంట శ్రీరాములపల్లిలో గొడవ జరిగింది. ఇల్లందుకుంటలోని పోలింగ్ కేంద్రం 224  బూత్ లో ఈవీఎం మెరాయింపుతో పోలింగ్ ఆలస్యం అవుతుంది. అయితే ఈ విషయంపై ఓ టీఆర్ఎస్ లీడర్ అసత్య ప్రచారం చేయడంతో  లైన్లో ఉన్న కొంతమంది ఓటర్లు వెనుదిరగడంతో అక్కడ గొడవ జరిగింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న టీఆర్ఎస్ ఇంచార్జ్, గజ్వేల్ మార్కెట్ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్ తో గొడవకు దిగారు గ్రామ ప్రజలు. ఒకవైపు పోలింగ్ జరుగుతుండగా.. ఊళ్లోకి ఎందుకొచ్చావని ప్రశ్నించారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు అక్కడి నుండి వెనుదిరిగి వెళ్లిపోయారు.