హుజురాబాద్: జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై కక్ష సాధింపు

హుజురాబాద్: జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై కక్ష సాధింపు

హుజురాబాద్, వెలుగు: హుజురాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు దశాబ్దాలుగా అద్దె ఇండ్లలో మగ్గుతున్నామని, సొంతింటి కోసం ఎదురుచూస్తున్న 50 మంది విలేకరుల పొట్టగొట్టేలా మార్కెట్ ​కమిటీ చైర్మన్​ గూడూరు రాజేశ్వరి భర్త, కాంగ్రెస్ నేత గూడూరు స్వామిరెడ్డి వ్యవహరిస్తున్నారని జర్నలిస్టులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్ల స్థలాలపై తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా కక్షపూరితంగా స్వామిరెడ్డి కోర్టులో వేసిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు, ప్రజాసంఘాల నాయకులు ధర్నా చేసి ర్యాలీ తీశారు.​ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కాయిత రాములు, కామిని రవీందర్ మాట్లాడుతూ.. పనులు చేయకుండానే దొంగ రికార్డులతో బిల్లులు మింగేసే స్వామిరెడ్డికి తమ ఇండ్ల స్థలాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. 

హుజురాబాద్ లోని సర్వే నంబర్ 125లో ఏకంగా 300 గజాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమంగా ఆఫీస్ కట్టుకున్నాడని ఆరోపించారు. జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్న స్వామిరెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. రాష్ట్ర మంత్రులు, నియోజకవర్గ ఇన్​చార్జ్ ప్రణవ్ బాబు జోక్యం చేసుకుని ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నిరసనలో ప్రజాసంఘాల నాయకులు చందుపట్ల జనార్దన్, వేల్పుల రత్నం, సందెల వెంకన్న, ప్రియదర్శిని, మాడుగుల ఓదెలు, సీనియర్ జర్నలిస్ట్ అంబాల ప్రభాకర్​తో పాటు భారీ సంఖ్యలో విలేకరులు, నాయకులు పాల్గొన్నారు.