వర్షాలు, వరదలతో నిండిన ప్రాజెక్టులు.. మస్తుగా హైడల్ పవర్ ఉత్పత్తి...

వర్షాలు, వరదలతో నిండిన ప్రాజెక్టులు..  మస్తుగా హైడల్ పవర్ ఉత్పత్తి...
  • రోజుకు 45 మిలియన్ యూనిట్లు జనరేట్
  • ఈ సీజన్​లో 2019.70 మిలియన్​ యూనిట్ల ఉత్పత్తి
  • ఖర్చు యూనిట్​కు రూ.2లోపే 
  • విద్యుత్  సంస్థలకు రూ.600 కోట్లు ఆదా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదల ప్రభావంతో జల విద్యుత్  ఉత్పత్తి భారీగా పెరిగింది. కర్నాటక నుంచి వస్తున్న  వరదల కారణంగా శ్రీశైలం, నాగార్జున సాగర్  ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు పెరిగాయి. దీంతో హైడల్  పవర్ ప్లాంట్లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. రోజుకు 45 మిలియన్ యూనిట్లకు పైగా జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ సీజన్‌‌లో ఇప్పటి వరకు 2,019.70 మిలియన్  యూనిట్ల పవర్  జనరేట్  అయ్యింది. తక్కువ ఖర్చుతో (యూనిట్‌‌కు రూ.2లోపు) ఈ ఉత్పత్తి జరగడంతో విద్యుత్  సంస్థలకు రూ.600 కోట్ల వరకు ఆదా అయిందని ఎలక్ట్రిసిటీ ఎక్స్‌‌పర్ట్‌‌లు అంచనా వేస్తున్నారు. 

విద్యుత్  ఉత్పత్తికి వానలు, వరదలు వరంగా మారాయని, ఇది రాష్ట్ర విద్యుత్  వ్యవస్థకు ఊతమిచ్చిందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 2,440 మెగావాట్ల జల విద్యుత్ సామర్థ్యం ఉండగా.. శ్రీశైలం (900 మెగావాట్లు), నాగార్జున సాగర్ (815 మెగావాట్లు), అప్పర్  జూరాల (234 మెగావాట్లు), లోయర్  జూరాల (240 మెగావాట్లు) ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి జరుగుతోంది. శ్రీశైలంలో రోజుకు 16- నుంచి 18 మిలియన్  యూనిట్లు, సాగర్ లో  17.26 మిలియన్  యూనిట్లు, అప్పర్  జూరాలలో 4.50 మిలియన్  యూనిట్లు, లోయర్  జూరాలలో 4.52 మిలియన్  యూనిట్ల కరెంట్  ఉత్పత్తి చేస్తున్నారు. ఇలా రోజువారిగా జెన్​కో జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 44 నుంచి 49.39 మిలియన్  యూనిట్ల హైడల్  పవర్  వస్తోంది.

రోజుకు 40 నుంచి 45 మిలియన్​ యూనిట్లు

గత నెల 16 నుంచి ఈ నెల 16 వరకు జల విద్యుత్  ఉత్పత్తి మరింత ఊపందుకుంది. గత 20 రోజుల్లో రోజుకు 40 మిలియన్  యూనిట్లకు తగ్గకుండా సగటున 44 నుంచి -45 మిలియన్  యూనిట్లు జనరేట్  అయ్యాయి. జులై 29న అత్యధికంగా 49.284 మిలియన్  యూనిట్లు నమోదయ్యాయి. ఈ నెలలో ఇప్పటి వరకూ 700 మిలియన్  యూనిట్లు దాటేసింది. మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) 2,060 మిలియన్  యూనిట్ల ఉత్పత్తి జరిగింది. గత ఏడాది ఇదే కాలంలో 350 మిలియన్  యూనిట్ల విద్యుత్  మాత్రమే ఉత్పత్తి అయింది.

గత  ఏడాదితో పోలిస్తే పది రెట్లు పెరిగిన జనరేషన్

ఏప్రిల్‌‌లో 56.53 మిలియన్  యూనిట్లు, మే నెలలో 84.39 మిలియన్  యూనిట్లు, జూన్‌‌లో 251.82 మిలియన్  యూనిట్లు, జులైలో 959.04 మిలియన్  యూనిట్ల విద్యుత్  ఉత్పత్తి జరిగింది. గత ఏడాది ఇదే టైమ్ లో ఏప్రిల్​ నుంచి ఆగస్టు నెల ఇదే టైం వరకు మొత్తం కలిపినా జల విద్యుత్  ఉత్పత్తి 300 మిలియన్​ యూనిట్లు దాటలేదు. కానీ, ఈయేడు ఇప్పటికే 2 వేల మిలియన్​ యూనిట్లు దాటేసింది.