
నత్తనడకన రసూల్ పురా – పికెట్ నాలా బ్రిడ్జి నిర్మాణం
కరాచీ బేకరీ పక్కన మొదలు పెట్టి నెల రోజులు పూర్తి
ఇంకా బేస్మెంట్ లెవల్లోనే పనులు
హైదరాబాద్, వెలుగు: రసూల్ పురా – పికెట్ నాలాపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు చాలా నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో మెయిన్‌రోడ్డుకు ఇరు వైపులా రూ.10కోట్లతో పనులు మొదలుపెట్టగా పోలీస్‌స్టేషన్ వైపు బ్రిడ్జి గత నెల 17న అందుబాటులోకి వచ్చింది. మొదట్లో 45 రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు చెప్పినప్పటికీ మూడు నెలలు పైనే పట్టింది. అప్పుడు పనులు ఆలస్యానికి పలు కారణాలు చెప్పారు. గత నెల 20న కరాచీ బేకరీ పక్కన రెండో వైపు మొదలు పెట్టేటప్పుడు కూడా 45 రోజుల్లో పూర్తిచేస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ ఆ మేరకు జరగట్లేదు. ఇప్పటికే నెల రోజులు అయిపోయాయి. పనులు మాత్రం బేస్మెంట్ లెవల్ దాటలేదు. ఇప్పుడు మరో రెండు నెలలు టైమ్పడుతుందని చెబుతున్నారు. వానలతో 15 రోజులపాటు పనులు జరగలేదని అంటున్నారు. వాన పడిన ప్రతిసారి ఈ రూట్లో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
అప్పుడే చేసుంటే..
రసూల్ పురా నాలాపై వర్షాకాలానికి ముందే పనులు ప్రారంభించారు. కానీ వానలు, కంకర కొరత కారణాలతో నెల రోజులపాటు పనులు జరగలేదు. ఇప్పుడు రెండో వైపు జరుగుతున్న నిర్మాణానికి కూడా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. పనులు ప్రారంభించి నెల రోజులు అవుతుంటే వానలతో 15 రోజులు జరగలేదని అధికారులు అంటున్నారు. వానలు టైంలో పనులు చేపట్టడమే ఆలస్యానికి, ట్రాఫిక్సమస్యకు కారణమని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎండా కాలంలోనే చేసుంటే నిర్మాణం పూర్తయ్యేది అంటున్నారు. వరుస లాక్డౌన్ల టైంలోనే నిర్మించి ఉంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదంటున్నారు. కానీ అధికారులకు ఎలాంటి ప్లానింగ్లేకుండా ఇప్పుడు హడావిడి చేస్తున్నారని విమర్శిస్తున్నారు. రెండో వైపు బ్రిడ్జి పనులతో పంజాగుట్ట వైపు నుంచి వెళ్లేవారికి ఇబ్బందులు లేనప్పటికీ, ప్యారడైస్ నుంచి పంజాగుట్ట వెళ్లే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. నాలుగు నెలలుగా ఇదే సమస్య కొనసాగుతోంది. సింధీ కాలనీలోంచి మినిస్టర్ రోడ్డు మీదుగా పంజాగుట్ట వెళ్తున్నారు.
మెయిన్ రోడ్డుపై ఇంత లేటుగానా?
మెయిన్రోడ్లపై నిర్మిస్తున్న వాటి పనులను కూడా జీహెచ్ఎంసీ అధికారులు వేగంగా చేయలేకపోతున్నారు. ఆలస్యానికి ఏదో ఒక కారణం చెబుతున్నారు. నెలలు పాటు పనులు కొనసాగుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డైలీ 2 లక్షలకు పైగా వెహికల్స్తిరిగే మెయిన్‌రోడ్డుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులే ఇంత స్లోగా జరుగుతున్నాయంటే అంతర్గత రోడ్లపై జరుగుతున్న పనుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని జనం విమర్శిస్తున్నారు. పనులు నెమ్మదిగా జరుగుతుండడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వానల టైంలో ట్రాఫిక్ క్లియర్ చేయడం వారి వల్ల కావడంలేదు. కిలోమీటర్ల వెహికల్స్నిలుస్తున్నాయి.