
హైదరాబాద్ నగర వాహనదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఎన్‌డీపీ) పికెట్ నాలా పై నిర్మించిన బ్రిడ్జి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రూ.10 కోట్ల వ్యయంతో దీని నిర్మాణం జరిగింది. మొత్తం రూ.45 కోట్లతో బేగంపేట వద్ద చేపట్టిన నాలా అభివృద్ది పనులు పూర్తయ్యాయి. ఈ బ్రిడ్జ్ ను రేపు (శుక్రవారం) మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. బ్రిడ్జ్ ప్రారంభం వల్ల ఇన్ని రోజులు ఇబ్బందులుపడిన వాహనదారులకు ఊరట లభించనుంది. మరోవైపు ట్రాఫిక్ సమస్య కూడా కొంతవరకు తగ్గనుంది.
నాలాకు ఇరువైపులా చేపట్టిన రిటైనింగ్ వాల్స్ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. 50 ఏళ్లుగా ఉన్న సమస్యలకు మంత్రి కేటీఆర్ చొరవతో పరిష్కారం దొరికిందని మంత్రి తలసాని అన్నారు. నాలా సమస్యను తీర్చేందుకు సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకొచ్చామన్నారు. వరద నీటిలో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నా.. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని.. ఆక్రమణలు జరిగినా చొరవ తీసుకోలేదని మండిపడ్డారు. బ్రిడ్జి నిర్మాణంతో వరద ముంపు ప్రాంతాల సమస్య పరిష్కారం అయిందని మంత్రి తలసాని అభిప్రాయపడ్డారు. రసూల్ పురా బస్తీ, అన్నానగర్, బీహెచ్‌ఈఎల్ కాలనీ, ఇక్రిశాట్ కాలనీ, సౌజన్య కాలనీ, బోయిన్‌పల్లిలో సాధారణ పరిస్థితి కనిపించనుందని మంత్రి చెప్పారు. అయితే ఈ నాలా బ్రిడ్జి నిర్మాణ పనులు రెండు నెలల్లోనే పూర్తి చేస్తామని అధికారులు అప్పట్లో హామీ ఇచ్చినప్పటికీ.. అందుకు ఆరు నెలల సుదీర్ఘ సమయం పట్టడం గమనార్హం. దీంతో ఇంతకాలంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.