హైదరాబాద్: 36 తులాల బంగారం చోరీ.. చిక్కడపల్లిలో ఘటన

హైదరాబాద్: 36 తులాల బంగారం చోరీ.. చిక్కడపల్లిలో ఘటన

ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో భారీ చోరీ జరిగింది. వివేక్ నగర్ లోని ఒక అపార్ట్ మెంట్  రెండో అంతస్తులో చొరబడిన దొంగ.. బీరువాలో ఉన్న 36 తులాల బంగారం, రూ.35 వేల నగదు తస్కరించి పరారయ్యాడు. డి.నారాయణ.. మిథానీ కంపెనీలో పనిచేసి రిటైర్  అయ్యారు. చిక్కడపల్లి వివేక్ నగర్ త్యాగరాయగాన సభ సమీపంలోని దిట్టకవి ఎంక్లేవ్ అపార్ట్ మెంట్  రెండో అంతస్తులో  ఆయన నివాసం ఉంటున్నారు. 

ఫ్లాట్  ప్రధాన ద్వారానికి ఉన్న తలుపులకు చెదలు పట్టడంతో కొత్త తలుపులు బిగించడానికి రిపేర్లు జరుగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు ఏదో శబ్దం వినిపించడంతో నారాయణ బయటకు వచ్చి చూశాడు. నిద్ర పట్టకపోవడంతో కాసేపు అటూఇటూ తిరిగాడు. అయితే.. రిపేర్ లో ఉన్న తలుపులకు గొళ్లెం వేయడం మరిచిపోయి పడుకున్నాడు. అదే సమయంలో ఒక దొంగ అపార్ట్ మెంట్  వెనుక వైపు నుంచి వచ్చాడు. 

నారాయణ ఇంటి తలుపులకు గొళ్లెం వేయకపోవడాన్ని గుమనించి  లోపలికి చొరబడ్డాడు. బీరువా తాళాలు సైతం దానికే ఉండడంతో బీరువా తెరిచి లోపల ఉన్న 36 తులాల బంగారం, రూ.35 వేల నగదు తస్కరించి పరారయ్యాడు. ఉదయం నిద్రలేచిన కుటుంబ సభ్యులు దొంగతనం జరిగినట్టు గుర్తించి చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ఇన్ స్పెక్టర్  రాజు నాయక్, డీఐ శంకర్ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్  టీంలు వచ్చి ఆధారాలు సేకరించాయి. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.