ఆస్తి తగాదాల గొడవ.. దొరికిన వన్యప్రాణి వేటగాళ్లు

ఆస్తి తగాదాల గొడవ.. దొరికిన వన్యప్రాణి వేటగాళ్లు
  • ఎయిర్ గన్ బెదిరింపు కేసులో ట్విస్ట్
  • ఫోన్​లో ఫొటోలే పట్టించినయ్

మెహిదీపట్నం, వెలుగు: ఆస్తి తగాదాల గొడవలో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, వన్యప్రాణుల వేట ఉదంతం వెలుగులోకి వచ్చింది. పాతబస్తీలోని మీర్ చౌక్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆస్తి తగాదాల నేపథ్యంలో ఎయిర్ గన్​తో బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలో నిందితుడి ఫోన్​ను తనిఖీ చేయగా, అందులో వన్యప్రాణులను వేటాడి, తిన్న ఫొటోలు లభించడంతో విచారణ వేగవంతం చేశారు.

నగరానికి చెందిన మరో నలుగురితో పాటు జడ్చర్ల, మక్తల్ ప్రాంతాలకు చెందిన ఇద్దరిని కలిపి మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కలిసి మహబూబ్ నగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో నెమళ్లు, జింకలు, కుందేళ్లు, కమ్జు పిట్టలను వేటాడుతున్నట్లు విచారణలో తేలింది. అడవిలోకి వెళ్లి వన్యప్రాణులను వేటాడుతున్న దృశ్యాలు నిందితుల ఫోన్లలో స్పష్టంగా కనిపిస్తుండటంతో, టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.