హైదరాబాద్: బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ (బీసీఏఎస్) ఆదేశాల మేరకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్యాసింజర్లకు బాడీస్కానర్ తనిఖీలను మొదలుపెట్టింది. మూడు నెలలపాటు ఈ స్కానర్లను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. డొమెస్టిక్ డిపార్చర్ టెర్మినల్ వద్ద దీనిని అమర్చినట్టు ఎయిర్‌పోర్టు నిర్వహణ సంస్థ జీఎంఆర్ తెలిపింది. అక్టోబర్12 నుంచి దీనిని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నామని పేర్కొంది. ప్రయోగాలు పూర్తై, అన్ని అనుమతులూ వస్తే మిగతా టెర్మినల్స్‌లోనూ ఈ స్కానర్లను ఏర్పాటు చేస్తారు. ఇవి సేఫ్ రేడియో వేవ్ సెక్యూరిటీ విధానం ద్వారా పనిచేస్తాయి కాబట్టి గోప్యతాపరమైన ఇబ్బందులు ఏమీ ఉండబోవని జీఎంఆర్ తెలిపింది. బాడీ స్కానర్ తనిఖీలు తప్పనిసరి కాదని, స్వచ్ఛందమేనని వివరించింది.

