- దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల రిజల్ట్ ఇప్పుడు కనపడుతోంది
- వైజాగ్లో గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్
- సౌత్ ఇండియాలో 2047 తర్వాత ఫెర్టిలిటీ రేటు సమస్య
- ఐఎస్బీ సెమినార్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోని పలు దేశాల్లో వయోవృద్ధుల సంఖ్య పెరుగుతోందని, 2047 తర్వాత భారత్ లోనూ ఇదే సమస్య వచ్చే అవకాశం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. దక్షిణ భారత్ లో ఫెర్టిలిటీ రేటు పెరిగేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని, అందుకే పాపులేషన్ మేనేజ్మెంట్ సిస్టంను తీసుకొచ్చి ప్రోత్సాహం అందించాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
ఆదివారం హైదరాబాద్గచ్చిబౌలిలో నిర్వహించిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్ బీ) సౌత్ ఏసియా లెర్నింగ్ సమ్మిట్ 2026 ట్రాన్స్ఫార్మింగ్ ఏఐ సదస్సులో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. “పాలనలో ఇవాళ తీసుకున్న నిర్ణయాలన్నీ రేపటికి చరిత్ర అవుతాయి.
గతంలో ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రా తదితర అంశాల్లో తీసుకొచ్చిన సంస్కరణలతో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ప్రపంచంలోని మోస్ట్ లివబుల్ సిటీగా మారింది. ఇదేమీ ఒక్కరోజులో జరిగింది కాదు. గతంలో తీసుకున్న స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు ఫలితాలిచ్చాయి. విభజన తర్వాత ఏపీలో ఒకే చోట పెద్ద మొత్తంలో భూమి లేదు అందుకే రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ అనే ఐడియాను తీసుకొచ్చాం. అమరావతి నిర్మాణం జరుగుతుండగా గత పాలకులు దానిని శ్మశానం అని గేలి చేసి విధ్వంసం చేశారు.
ఇప్పుడు దాన్ని పునర్నిర్మిస్తున్నాం. హైదరాబాద్ ప్లస్ గా అమరావతి తయారవుతుంది. టెక్నాలజీని అనుసంధానించి స్మార్ట్ సిటీగా, బ్లూ గ్రీన్ రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నాం” అని చంద్రబాబు అన్నారు. అమరావతిలో త్వరలోనే క్యాంటం కంప్యూటర్ పనిచేయటం ప్రారంభిస్తుందని, దాని తయారీకి అవసరమైన పరికరాలను కూడా ఉత్పత్తి చేస్తామన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోందని, రిలయన్స్ కూడా డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. 2047 స్వర్ణాంధ్ర ద్వారా రాష్ట్రాభివృద్ధికి విజన్ రూపకల్పన చేశామని పేర్కొన్నారు.
