- జూబ్లీహిల్స్ పోలీసులకు మరో బాలిక ఫిర్యాదు
- సంపన్న బాలికలకు ప్రేమ పేరుతో వల.. డబ్బులు గుంజి మోసం
- నిందితుడికి తల్లి, సోదరుడు, మేనమామ సహకారం
- ఇప్పటికే చంద్రశేఖర్ సహా 11 మంది అరెస్ట్
జూబ్లీహిల్స్, వెలుగు: ఇన్‌స్టాగ్రామ్‌లో లగ్జరీ కార్లు, ఖరీదైన పబ్బులు, రిసార్టుల ఫొటోలు.. కట్ చేస్తే, మైనర్లను ట్రాప్ చేసి, వారి జీవితాలతో ఆడుకుంటూ అందినకాడికి దోచుకునే ఓ మాయగాడి ‘హైటెక్ దోపిడీ’ సిటీలో సంచలనం సృష్టిస్తోంది. ‘రిచ్ కిడ్’ ముసుగులో సంపన్న బాలికల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
సోషల్ మీడియా ద్వారా సంపన్న కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను ట్రాప్ చేస్తున్న ఈ ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు పట్టుకున్నారు. మియాపూర్‌కు చెందిన చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ ఈ గ్యాంగ్‌కు సూత్రధారి. లగ్జరీ కార్లు, పబ్బులు, రిసార్టుల్లో దిగిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ‘రిచ్ కిడ్’లా కలరింగ్ ఇచ్చేవాడు. ఫొటోలు, వీడియోలను లైక్ చేసిన బాలికలతో చాటింగ్ మొదలుపెట్టేవాడు. వారి వ్యక్తిగత వివరాలు అడిగి తెలుసుకుని మాయ మాటలు చెప్పేవాడు. ఆ తర్వాత డైరెక్ట్‌గా కలిసి కొన్ని రోజులు స్నేహం, మరికొన్ని రోజులు ప్రేమ, తరువాత పెండ్లి అంటూ బాలికలను నమ్మించి శారీరక సంబంధం పెట్టుకునేవాడు.
వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలను తన దగ్గర పెట్టుకునేవాడు. ఆ తరువాత తనకు డబ్బులు అవసరం ఉందంటూ అందినంత దోచుకునేవాడు. ఒక్కో సందర్భంలో వారు వినకపోతే బాలికతో చనువుగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలను చూపెట్టి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేవాడు. ఈ క్రమంలో గత నెలలో జూబ్లీహిల్స్ కు చెందిన ఓ బాలిక దగ్గర నుంచి పలు దఫాలుగా రూ.13 లక్షలు వసూలు చేశాడు. బాలిక తండ్రి డబ్బులు కనిపించకపోవడంతో అనుమానంతో ఆరా తీయడంతో విషయం బయటపడింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.
కన్నతల్లి, మేనమామ సహకారం
ఈ దోపిడీలో అర్జున్ తో పాటు అతడి కుటుంబసభ్యుల పాత్ర ఉండడంతో పోలీసులు సైతం విస్తుపోతున్నారు. అర్జున్ తన తల్లి, సోదరుడు రాజు, మేనమామ సహకారంతో ఈ దోపిడీ సొమ్మును దారి మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది. బాధితుల నుంచి వసూలు చేసిన నగదును ఎప్పటికప్పుడు తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లిస్తూ, వారందరూ కలిసి విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠా ఇప్పటివరకు ఆరుగురికిపైగా బాలికలను మోసం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
పెరుగుతున్న బాధితుల సంఖ్య
నిందితుడు ప్రస్తుతం రిమాండ్‌లో ఉండటంతో, అతని చేతిలో మోసపోయిన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా మంగళవారం మరో బాలిక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. హర్ష అనే వ్యక్తి ద్వారా అర్జున్ పరిచయమయ్యాడని, తనను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక దాడి చేయడమే కాకుండా, బంగారు గొలుసు కూడా తీసుకున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
