ఏరోస్పేస్ డెస్టినేషన్గా హైదరాబాద్..మిసైళ్ల తయారీ నుంచి టెస్టింగ్ దాకా ఇక్కడే : ఏరోస్పేస్ రంగ నిపుణులు

ఏరోస్పేస్ డెస్టినేషన్గా హైదరాబాద్..మిసైళ్ల తయారీ నుంచి టెస్టింగ్ దాకా ఇక్కడే : ఏరోస్పేస్ రంగ నిపుణులు
  • రాకెట్ల అభివృద్ధి నుంచి ఆయుధాల సరఫరా కూడా..
  •     విమానాల ఇంజన్లకూ విడిభాగాలూ ఇక్కడి నుంచే..
  •     అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్ విడిభాగాల తయారీలో తెలంగాణ అమ్మాయిలు
  •     ‘తెలంగాణ ఫ్లై హై: ద రైజ్ ఆఫ్ ఏరోస్పేస్ డిఫెన్స్’ ప్యానెల్ డిస్కషన్​లో నిపుణులు

హైదరాబాద్, వెలుగు:  మిసైళ్ల తయారీ, రాకెట్ల అభివృద్ధి, ఆయుధాల సరఫరాతో పాటు విమానాల ఇంజన్లు, విడిభాగాల తయారీకీ హైదరాబాద్ చారిత్రక గమ్యస్థానంగా మారుతున్నదని ఏరోస్పేస్​ రంగ నిపుణులు చెప్పుకొచ్చారు. మిసైళ్లను టెస్ట్ చేసే ఫెసిలిటీని కూడా త్వరలోనే హైదరాబాద్​లో ఏర్పాటు కాబోతున్నట్టు వివరించారు. మరోవైపు ఆపరేషన్ సిందూర్​లో అత్యంత కీలకంగా మారిన బ్రహ్మోస్, ఆకాశ్ మిసైళ్లు హైదరాబాద్​లోనే తయారయ్యాయని పేర్కొన్నారు.

ఎన్నో రక్షణ రంగ పరిశ్రమలు ఇక్కడే ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్​లో భాగంగా సోమవారం నిర్వహించిన ‘తెలంగాణ ఫ్లై హై: ద రైజ్ ఆఫ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్’అనే టాపిక్​పై పానెల్ డిస్కషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి హార్డ్​కోర్ సబ్జెక్టుల నిపుణుల కొరత వేధిస్తున్నదని పలువురు నిపుణులు చెప్పారు.

ఈ నిపుణులను తయారు చేసుకుంటే హైదరాబాద్​ ఏరోస్పేస్ రంగాన్ని ఏలుతుందని చెప్పుకొచ్చారు. కాగా, ఈ ప్యానెల్ డిస్కషన్​కు చీఫ్​గా డీఆర్​డీవో మాజీ చైర్మన్ సతీశ్ రెడ్డి వ్యవహరించారు. ఈ చర్చలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీడీఎల్ చైర్మన్ మాధవరావు, బ్రహ్మోస్​ సీఎండీ జేఆర్ జోషి, అనంత్ టెక్నాలజీస్ ఎండీ సుబ్బారావు, స్కైరూట్ ఫౌండర్ నాగభరత్​, సఫ్రాన్ సీఈవో జితేందర్​ గవాంకర్, టాటా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మసూద్ హుస్సేనీ పాల్గొన్నారు. 

ఎలక్ట్రానిక్ వార్​ఫేర్​కు కేరాఫ్  హైదరాబాద్: సతీశ్ రెడ్డి

ఆకాశ్, అగ్ని, బ్రహ్మోస్ వంటి ఎలక్ట్రానిక్ మిసైల్స్ అన్నీ హైదరాబాద్ కేంద్రంగానే తయారవుతున్నాయని డీఆర్​డీవో మాజీ చైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. ‘‘భవిష్యత్​లో మరిన్ని ఎలక్ట్రానిక్​ వార్​ఫేర్ రీసెర్చ్, అభివృద్ధికి హైదరాబాద్ చిరునామాగా మారుతుంది. ఈ విషయంలో హైదరాబాద్​ ‘ఫ్లై హై’గా ఎదుగుతున్నది. ఇప్పటికే రూ.లక్ష కోట్ల విలువైన ఉత్పత్తులు ఇక్కడి నుంచే వచ్చాయి. ఇది మరింతగా పెరుగుతుంది. ఈ ఏడాది రూ.1.50 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులు ఇండియాలోనే తయారయ్యాయి.

వచ్చే ఏడాదికి రూ.1.75 లక్షల కోట్ల టార్గెట్ పెట్టారు. అయితే, 2028–29 నాటికి రక్షణ శాఖ మంత్రి టార్గెట్​ను రూ.3 లక్షల కోట్లకు పెంచారు’’అని ఆయన తెలిపారు. విమాన ఇంజన్లలోని 13 విడిభాగాలను ఎంఆర్​వో ఫెసిలిటీలో ఉత్పత్తి చేస్తామని సఫ్రాన్ సీఈవో జితేందర్​ గవాంకర్​ పేర్కొన్నారు. రఫేల్ ఇంజన్లనూ ఇక్కడ తయారు చేస్తామని వివరించారు.  

ఇబ్రహీంపట్నంలో  మిసైల్ టెస్ట్​ సెంటర్: మాధవ రావు

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్​లో 55 ఏండ్లుగా సేవలందిస్తున్నదని, ఆర్మీకి వివిధ ఆయుధాలను సరఫరా చేస్తున్నదని బీడీఎల్ చైర్మన్ మాధవరావు అన్నారు. ‘‘బీడీఎల్​తో ప్రస్తుతం 3,500 సంస్థలు పనిచేస్తున్నాయి. అందులో 1,500 కంపెనీలు ఎంఎస్​ఎంఈ పరిశ్రమలే. మెదక్​లోని భానూరు వద్ద వెయ్యి ఎకరాల్లో మిసైల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేశాం.

ఈ కేంద్రంలోనే అస్త్ర అనే మిసైల్​ను అభివృద్ధి చేస్తున్నాం. ఇబ్రహీంపట్నంలో 500 ఎకరాల్లోనూ మరో ప్లాంట్​ను ఏర్పాటు చేయబోతున్నం. ఫేజ్ 1లో టెస్ట్ ఫెసిలిటీలను ఏర్పాటు చేశాం. క్రూయిజ్ మిసైల్స్​ను ఇక్కడ తయారు చేస్తాం. లాంగ్ రేంజ్ బాలిస్టిక్​ మిసైల్స్​ను తయారు చేస్తాం’’అని మాధవరావు అన్నారు. 

నాజూకు బ్రహ్మోస్: జేఆర్​ జోషి

లైట్ కంబాట్ ఎయిర్​క్రాఫ్ట్​లకు సరిపోయేలా ‘స్లీక్ (సన్నని/నాజూకైన)’ బ్రహ్మోస్ వెర్షన్​ను తయారు చేస్తున్నామని బ్రహ్మోస్ మిసైల్ ఇండియా సీఎండీ జేఆర్ జోషి తెలిపారు. ‘‘ఈ క్షిపణి వ్యాసాన్ని తగ్గిస్తున్నం. తద్వారా జలాంతర్గాముల నుంచి కూడా దీనిని ప్రయోగించేందుకు వీలవుతది. హైపర్​సోనిక్​ వెర్షన్​నూ అభివృద్ధి చేస్తున్నాం. ఎయిర్​పోర్ట్​ నుంచి హైదరాబాద్ సిటీలోని ఏ ప్రాంతానికైనా కేవలం గంటన్నరలోనే చేరుకోవచ్చు. చాలా ఏరోస్పేస్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులకు ముందుకొస్తున్నాయి’’అని ఆయన పేర్కొన్నారు.

స్పేస్ ఎకానమీ వాటాను 10 శాతానికి పెంచాలి: స్కై రూట్ ఫౌండర్ నాగభరత్

విక్రమ్1 రాకెట్ ద్వారా తొలి ఆర్బిటల్ ప్రయోగానికి సిద్ధమవుతున్నామని స్కైరూట్ ఫౌండర్ నాగభరత్​ పేర్కొన్నారు. ‘‘విక్రమ్​1ను హైదరాబాద్​లోనే డిజైన్ చేసి.. తయారు చేశాం. స్పేస్ రంగంలో టాప్ 5 దేశాల్లో మన దేశం ఉన్నా.. స్పేస్ ఎకానమీ వాటా మాత్రం కేవలం 5 శాతమే ఉంది.

దీన్ని 10 శాతానికి పెంచేలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఏరోస్పేస్​లో డీప్ టెక్నాలజీని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగే అన్ని అర్హతలు, సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయి’’అని ఆయన తెలిపారు. నాలెడ్జ్​ను గ్రామాలకూ విస్తరిస్తేనే 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధ్యమవుతుందని అనంత్ టెక్నాలజీస్ ఎండీ సుబ్బారావు అన్నారు.

రక్షణ సంస్థలకు చారిత్రక వేదిక తెలంగాణ: మంత్రి ఉత్తమ్​

డీఆర్​డీవో, డీఆర్​డీఎల్, బీడీఎల్, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, బీఈఎల్, హెచ్​ఏఎల్, మిధానీ వంటి ఎన్నో రక్షణ రంగ పరిశ్రమలకు తెలంగాణ చారిత్రక వేదికగా ఉన్నదని ఇరిగేషన్, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అందుకు అనుగుణంగా 1,500 ఎంఎస్​ఎంఈలు డిఫెన్స్​, ఏరోస్పేస్ రంగాల్లో తమ ఉనికిని చాటుతున్నాయన్నారు. బోయింగ్, రఫేల్, లాక్​హీడ్ మార్టిన్, సఫ్రాన్, ఎయిర్​బస్​ వంటి ప్రధాన ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు హైదరాబాద్ గమ్యంగా మారిందని తెలిపారు. ‘‘టాటా సఫ్రాన్ ఏరో ఇంజన్ ఫెసిలిటీ, సఫ్రాన్ ఎంఆర్​వో వంటి సంస్థలూ హైదరాబాద్​లో ఏర్పాటయ్యాయి.

యూఏవీ, రోబోటిక్స్, అడ్వాన్స్డ్ కాంపోజిట్ వంటి వాటికి గ్లోబల్ ఏరోస్పేస్ హబ్​గా హైదరాబాద్ మారింది. ఏరోస్పేస్ పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ అత్యంత కాస్ట్ ఎఫెక్టివ్ నగరంగా ఉంది. ఇటీవల ఫైనాన్షియల్​ టైమ్స్ ఇచ్చిన ర్యాంకింగ్స్​లో ఈ జాబితాలో హైదరాబాద్ నంబర్​వన్​గా నిలిచింది.

ఏరోస్పేస్​ రంగానికి తెలంగాణ అత్యంత ఉన్నతమైన గమ్యస్థానమని విమానయాన శాఖ గుర్తించింది. 2018, 2020, 2022, 2024లో హైదరాబాద్ నంబర్ వన్ స్థానంలో ఉంది. 2025లో ఏరోస్పేస్.. ఫార్మా ఎక్స్​పోర్ట్స్​ను దాటాయి. 2023 – 2024లో రూ.15,900 కోట్లుగా ఉన్న ఏరోస్పేస్​ ఎక్స్​పోర్ట్స్​.. ఈ ఏడాది 9 నెలల్లోనే రూ.30,742 కోట్లకు పెరగడం ఈ రంగం వృద్ధికి నిదర్శనం’’అని ఉత్తమ్ తెలిపారు.

తెలంగాణ అమ్మాయిలే విమాన భాగాలు తయారుచేస్తున్నరు: మసూద్ హుస్సేనీ

ఒకప్పుడు విమానాల్లోని భాగాలను ఇండియాలో తయారు చేస్తారంటే అనుమానంగా చూసేవారని, కానీ, ఇప్పుడు ప్రపంచంలో అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్ సహా అన్ని విమానాలకూ ఇక్కడి నుంచి విడిభాగాలు సరఫరా అవుతున్నాయని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్ మసూద్​ హుస్సేని చెప్పారు. ‘‘విమానాల్లో అంతటి ముఖ్యమైన విడిభాగాలను తెలంగాణకు చెందిన అమ్మాయిలే తయారు చేస్తుండడం మరింత గర్వించదగిన విషయం.

అసలు విమానమంటే తెలియని మారుమూల గ్రామాలకు చెందిన అమ్మాయిలు ఇంతటి ఘనత సాధించారు. మన దేశ.. తెలంగాణ సామర్థ్యం.. మహిళల శక్తిని తెలియజెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు.

ఇప్పుడు హైదరాబాద్​లోనే పూర్తి విమానాన్ని (సీ295) తయారు చేస్తున్నాం. హైదరాబాద్ ఫెసిలిటీలో యుద్ధ విమానాలతో పాటు మామూలు విమానాలకు 70 శాతం ఇంజన్ పరికరాలను తయారు చేస్తున్నాం. ప్రపంచంలోని 50 శాతం రఫేల్ యుద్ధ విమానాల్లో ఇక్కడ తయారు చేసిన ఫ్యూజ్​లార్జ్​లే వాడుతున్నరు’’అని మసూద్ తెలిపారు.