నీలోఫర్​ హాస్పిటల్‌‌లో అక్రమ నిర్మాణం కూల్చివేత

నీలోఫర్​ హాస్పిటల్‌‌లో అక్రమ నిర్మాణం కూల్చివేత
  • ప్రభుత్వం సీరియస్
  • సూపరింటెండెంట్‌‌పై హెల్త్ సెక్రటరీ, కలెక్టర్ ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: నీలోఫర్ హాస్పిటల్‌‌లో అక్రమంగా నిర్మిస్తున్న ప్రైవేట్ మెడికల్ షాపును హైదరాబాద్ రెవెన్యూ అధికారులు గురువారం సాయంత్రం కూల్చివేశారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు ఆసిఫ్ నగర్ తహసీల్దార్​జ్యోతి ఆధ్వర్యంలో నేలమట్టం చేశారు. హాస్పిటల్​ఆవరణలోని పార్కు స్థలంలో మంగళవారం రాత్రి అక్రమ నిర్మాణం మొదలుపెట్టి బుధవారం ఉదయం వరకు గోడలు లేపేశారు. దీనిపై ‘వెలుగు’లో ‘నీలోఫర్ గడ్డ..యాపారానికి అడ్డా’ హెడ్డింగ్​తో వార్త ప్రచురితమైంది. దీంతో నిర్మాణాన్ని కూల్చివేశారు.  

సూపరింటెండెంట్‌‌పై ఆగ్రహం

మెడికల్​షాపు నిర్మాణానికి కలెక్టర్, డీఎంఈ అనుమతి ఉందని సూపరింటెండెంట్ చెప్పగా, దీనిపై కలెక్టర్ అనుదీప్ స్పందించి తాను ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కలెక్టర్​ఢిల్లీలో ఉండగా, సూపరింటెండెంట్​కు ఫోన్​చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘వెలుగు’లో కథనం చూసిన హెల్త్ సెక్రెటరీ క్రిస్టీనా చోంగ్తూ కూడా సూపరింటెండెంట్‌‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ మెడికల్ షాపు నిర్మాణానికి ఎలా సాహసించారని, అనుమతులున్నట్లు మీడియాకు తప్పుడు సమాచారం ఎలా ఇచ్చారని ప్రశ్నించినట్లు తెలిసింది.  

జెనరిక్ మెడికల్ షాపు కోసమేనంటూ.. 

అక్రమ నిర్మాణం కూల్చివేత తర్వాత, సూపరింటెండెంట్ రవి కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. జెనరిక్ మెడికల్ షాపు కోసమే తాత్కాలిక గది సిద్ధం చేస్తున్నామని, దానిని ఎవరికీ కేటాయించలేదని, ఉన్నతాధికారుల ఆదేశాలతో హోల్డ్‌‌లో ఉంచామని స్పష్టం చేశారు. అయితే, రూల్స్​ప్రకారం జెనరిక్ మెడికల్ షాపు కోసమే నిర్మిస్తున్నట్టయితే రెవెన్యూ అధికారులు కూల్చివేయాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా, మంగళవారం నుంచే మెడికల్​షాపు నిర్మాణంపై చర్చ జరుగుతున్నా, జెనరిక్ మెడికల్ షాపు గురించి అని సూపరింటెండెంట్ చెప్పలేదు. ఉన్నతాధికారులు మందలించిన తర్వాత గట్టెక్కేందుకే ఇలా చెప్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.