ఒంటరి వృద్ధురాలికి అండగా బంజారాహిల్స్ ఎస్ఐ

ఒంటరి వృద్ధురాలికి అండగా బంజారాహిల్స్ ఎస్ఐ

హైదరాబాద్ బంజారాహిల్స్ ఎస్ఐ కరుణాకర్ రెడ్డి గొప్ప మనసు చాటుకున్నారు. ఓ వృద్ధురాలికి అండగా నిలిచి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు. 

బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ఉన్నిసా బేగం(70) అనే వృద్ధురాలు నివసిస్తోంది. ఆమె భర్త 30 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఇద్దరు కుమార్తెలకు పెళ్ళిళ్ళు కావడంతో వాళ్ల ఇంటికి వెళ్లిపోయారు. పైసా పైసా కూడబెట్టిన డబ్బులతో గత ఏడాది ఉన్నిసా బేగం.. తన సొంతింటిని బాగు చేయించుకుంది. అయితే.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సిమెంట్ రేకులు పాడైపోయి.. ఇల్లు కురవడంతో ఇబ్బందులు పడింది. ఇంట్లోకి వర్షపు నీళ్లు రావడంతో చాలా సమస్యలు ఎదుర్కొంది. 

ఇదే విషయంపై మేస్త్రిపై (భవన నిర్మాణ కాంట్రాక్టుదారుడు) ఫిర్యాదు చేసేందుకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఉన్నిసా బేగం ఆవేదనను అర్థం చేసుకున్న ఎస్ఐ కరుణాకర్ రెడ్డి నేరుగా ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించాడు. వృద్ధురాలి బాధని గుర్తించి.. ఆమె ఇంటికి కొత్త సిమెంట్ రేకులను తన సొంత ఖర్చులతో వేయించాడు. వృద్ధురాలి అండగా నిలిచాడు. దీంతో ఆ పెద్దావిడ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పూలమాలతో వెళ్లి..స్వీట్లు పంచింది. దీంతో ఇప్పుడు అందరూ ఎస్ఐ కరుణాకర్ రెడ్డిని శభాష్ పోలీస్ అంటూ అభినందిస్తున్నారు.