- టెక్నాలజీ విస్తరణతోనే పెరిగిన ఆదరణ
- భారత్ లో నాలుగు నగరాలకు చోటు
- 82వ స్థానంలో మన ముత్యాల నగరం
- 29వ స్థానంలో బెంగళూరు, 40వ ప్లేస్ లో ముంబై, 54వ స్థానంలో ఢిల్లీ
- రెసోనెన్స్ కన్సల్టెన్సీ–ఇప్సోస్ నివేదికలో వెల్లడి
- గ్రేటర్ విస్తరణతో దేశంలోనే పెద్ద సిటీగా అవతరణ
హైదరాబాద్: ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల జాబితాలో భారత్ కు సంబంధించిన నాలుగు సిటీలకు చోటు దక్కింది. హైదరాబాద్ 82 స్థానంలో నిలిచింది. క్యాపిటల్స్ ఆఫ్ క్యాపిటల్ గా పిలువబడే లండన్ నగరం వరుసగా 11వ సారి ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. సెకండ్ ప్లేస్ లో న్యూయార్క్, మూడో స్థానంలో ప్యారిస్, నాలుగో ప్లేస్ లో టోక్యో, ఐదో స్థానంలో మాడ్రిడ్, ఆరో ప్లేస్ లో సింగపూర్, ఏడో స్థానంలో రోమ్, ఎనిమిదో స్థానంలో బెర్లిన్ నిలిచాయి. మన దేశానికి చెందిన నాలుగు నగరాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అందులో బెంగళూరు 29వ ర్యాంకు సాధించింది.
టెక్ ఎకోసిస్టం, విస్తరించిన కార్పొరేట్ బేస్ వల్ల బెంగళూరు నగరం ప్రపంచ గుర్తింపును సాధించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై 40వ స్థానంలో నిలిచింది. ఉద్యోగాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, ఇన్నోవేషన్ కేంద్రంగా ముంబై ప్రాధాన్యం పెరుగుతోందని రిపోర్ట్ పేర్కొంది. రాజకీయ ప్రభావం, రవాణా కనెక్టివిటీ, అభివృద్ధి చెందుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా దిల్లీ 54వ ర్యాంక్ లో నిలిచిందని నివేదిక వెల్లడించింది. పెరుగుతున్న టెక్నాలజీ విస్తరణ, ఐటీ సేవల కేంద్రంగా ఎదుగుతున్న కారణంగా మన హైదరాబాద్ 82వ ప్లేస్ లో నిలిచిందని నివేదిక తెలిపింది.
34 కేటగిరీల్లో పరిశీలన
వరల్డ్స్ బెస్ట్ సిటీస్ రిపోర్టు సిద్ధం చేయడానికి రెసోనెన్స్ కన్సల్టెన్సీ–ఇప్సోస్ సంస్థ ప్రధానంగా 34 కేటగిరీలను పరిశీలించింది. లీవెబులిటీ, లవ్ ఎబులిటీ, ప్రాస్పరిటీని ప్రధానంగా తీసుకొని విశ్లేషించారు. ఈ అంతర్జాతీయ జాబితాలో ఇలా మొత్తం 276 నగరాల గుర్తించగా.. భారత్ నాలుగు ప్రధాన నగరాలు బలమైన స్థానాలు దక్కించుకోవడం గమనార్హం. పెరుగుతున్న టూరిజం, అధునాతన సౌకర్యాలు, ఉన్నత జీవన ప్రమాణాలతో టోక్యో 4వ స్థానం, సింగపూర్ 6వ స్థానంలో నిలిచాయి.
విస్తరణ తర్వాత దేశంలోనే పెద్దసిటీ
ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల జాబితాలో స్థానం సంపాదించుకున్న హైదరాబాద్ రూపు రేఖలు మారనున్నాయి. నిన్న కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో దేశంలోనే అతి పెద్ద మహానగరంగా భాగ్యనగరం మారబోతున్నది. హైదరాబాద్ శివారులో ఉన్న 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అందుకోసం జీహెచ్‌ఎంసీ, తెలంగాణ మునిసిపాలిటీ చట్టాలను సవరించడానికి మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం 150 మునిసిపల్ డివిజన్లతో ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధి కొత్తవాటి విలీనంతో మూడింతలు పెరగనుంది. నగర పరిధి దాదాపు 2,735 చదరపు కిలోమీటర్లు ఉండనుంది. జనాభా దాదాపు రెండు కోట్లు ఉంటుంది.
