Telangana Global Summit :అతిథులకు ఘుమఘుమలాడే హైదరాబాద్ బిర్యానీ.. సర్వపిండి, పచ్చిపులుసు

Telangana Global Summit :అతిథులకు ఘుమఘుమలాడే హైదరాబాద్  బిర్యానీ.. సర్వపిండి, పచ్చిపులుసు

 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడ్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’కు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న ఈ మెగా ఆర్థిక సదస్సుకు అధికార యంత్రాంగం అంతర్జాతీయ స్థాయిలో  ఏర్పాట్లు చేసింది. దాదాపు మూడు వేల మంది దేశ, విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. సోమవారం మధ్యాహ్నం 1. 30 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సమిట్​ను ప్రారంభిస్తారు. అనంతరం  2.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సదస్సును ఉద్దేశించి కీలక ప్రసంగం చేస్తారు.

తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమిట్​కు ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు 44 దేశాలకు చెందిన 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు వస్తున్నారు. అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధుల బృందం హాజరుకానున్నారు. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి తేవడమే లక్ష్యంగా ఈ సమిట్​ సాగనుంది
 
హైదరాబాద్​ బిర్యానీ.. సర్వపిండి.. పచ్చిపులుసు

తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమిట్​కు  వచ్చే అతిథులకు రెండు రోజులూ ఘుమఘుమలాడే పసందైన హైదరాబాద్​ బిర్యానీతో పాటు తెలంగాణ రుచులను అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సర్వపిండి, పచ్చిపులుసు వంటి సంప్రదాయ వంటకాలతో పాటు స్థానిక మిల్లెట్స్ తో చేసిన ఆహార పదార్థాలను అందించనున్నారు. ఇందుకోసం భారీ వంటశాలలను ఏర్పాటు చేశారు.  

వీటితో పాటు నోరూరించే తెలంగాణ పిండివంటలైన సకినాలు, చెక్కలు, ఇప్పపువ్వు లడ్డు, నువ్వుల ఉండలు, బాదం-కీ-జాలి, మక్క పేలాలతో కూడిన ప్రత్యేక బాస్కెట్‌‌‌‌‌‌‌‌ను కూడా అతిథులకు అందజేయనున్నారు.