హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల మహ్మద్ అహ్మద్ ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాడు. రష్యాలో ఉన్నత వేతనంతో ఉద్యోగం అందిస్తామని చెప్పిన ఒక ముంబై ఏజెంట్ మాటలు నమ్మి “కొత్త జీవితం” మీద కోటి ఆసలు పెట్టుకున్నాడు. కానీ, ఆ కల క్రమక్రమంగా భయంకరమైన వాస్తవంగా మారటంతో అతని జీవితం అనుకోకుండా యుద్ధంలోకి అడుగుపెట్టింది.
మంచి జాబ్, శాలరీ అంటూ ఏజెంట్లు చెప్పిన మాటలు నమ్మి రష్యాకు చేరిన అహ్మద్‌ను నిర్మాణాల సైట్‌కి తీసుకెళ్లడానికి బదులుగా ఒక సైనిక శిబిరానికి తరలించారు. అక్కడ పది రోజుల పాటు ఆయుధాల శిక్షణ ఇచ్చి.. యుద్ధరంగానికి పంపిస్తామని చెప్పారు. అక్కడి వారి మాటలు విన్న అహ్మద్ గుండె ఆగినంత పనైంది. అతడు తన వీడియోలో చెప్పిన వివరాలు కుటుంబాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి. అహ్మద్ ప్రాణాలతో తిరిగి వస్తారో రారో అని అతని కుటుంబం కలవరపడుతోంది.
అహ్మద్ కి ఏమౌతుందో అని భయంలో ఉన్న అతని కుటుంబం ఎప్పుడు ఫోన్ రింగైనా ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో అనే ఆందోళనలో ఉంది. ఇలా తన భర్తతో పాటు దాదాపు 30 ఇతరులు రష్యా యుద్ధంలో ఉన్నారని అఫ్షా చెప్పారు. అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని అనుకున్న అహ్మద్ ఒక ఆర్మీ వాహనం నుంచి దూకటంతో కాలు విరిగిందని.. ఇప్పటికే అతని బృందంలో 17 మంది మరణించినట్లు ఆమె వెల్లడించారు. తమ మాట విని యుద్ధంలో పాల్గొనటానికి వెళ్లకపోతే చంపేస్తామని అక్కడి సైనికులు బెదిరించారని ఆమె చెప్పారు. అహ్మద్ పంపిన వీడియో ప్రకారం తన తలపై గన్ పెట్టి యుద్ధానికి వెళ్లాల్సిందేనని బెదిరించినట్లు తేలింది.
అహ్మద్ కుటుంబం ఇప్పుడు నిరీక్షణలో ఉంది. భార్య అఫ్షా కన్నీటితో గడుపుతుంది. బలవంతంగా తమ వాళ్లను రష్యాలో యుద్ధానికి పంపుతున్నారని ఆమె వాపోయింది. విషయం బయటకు రావడంతో మజ్లిస్ బచావో తహ్రీక్ ప్రతినిధి అంజద్ ఉల్లా ఖాన్ భారత విదేశాంగ మంత్రికి వివరించారు. గత ఏడాది కూడా ఇదే తరహా ఘటనలో ఒక హైదరాబాద్ యువకుడు ప్రాణాలు కోల్పోయాడని, వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
