ఎల్నినో ఎఫెక్ట్..నీళ్లు, కరెంట్ వాడకం తగ్గించాలె

ఎల్నినో ఎఫెక్ట్..నీళ్లు, కరెంట్ వాడకం తగ్గించాలె
  • హైదరాబాద్‌‌లో 29 శాతం తక్కువ వర్షపాతం
  • 16 మండలాల్లో 20 శాతానికి పైగా పడిపోయిన గ్రౌండ్​ వాటర్​ 
  • కొత్త బోర్లకు పర్మిషన్ ​బంద్​ 
  • ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ 
  • కలెక్టరేట్ లో ఉన్నతాధికారులతో సమావేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లో ఎల్‌‌నినో ప్రభావం, తగ్గుతున్న భూగర్భ జలాల నేపథ్యంలో నీరు, కరెంట్​వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈసారి నగరంలో సుమారు 29 శాతం తక్కువ వర్షపాతం నమోదుకాగా,16 మండలాల్లో భూగర్భ జలాలు 20 శాతానికి పైగా తగ్గాయని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. లక్డీకాపూల్‌‌లోని హైదరాబాద్ కలెక్టరేట్‌‌లో కలెక్టర్ ప్రియాంక, జీహెచ్‌‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎండీ జితేశ్ పాటిల్‌‌తో పాటు వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 

రాష్ట్రంలో ఎల్‌‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించామని, హైదరాబాద్ జిల్లా బాధ్యతలను తాను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం నగరంలో తాగునీటి సరఫరాకు కొరత లేదని, భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రతి కుటుంబం నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించుకోవాలని సూచించారు.

 నల్లా పైపులకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాగునీరు మినహా నిర్మాణాలు, పరిశ్రమలు, సమాచార కేంద్రాలు, తోటల పెంపకం వంటి అవసరాలకు మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి శుద్ధి చేసిన నీటినే వినియోగించాలని స్పష్టం చేశారు. భూగర్భ జలాలు తగ్గుతున్నందున అత్యవసర పరిస్థితులు మినహా కొత్త బోరుబావులకు అనుమతులు ఇవ్వబోమని తెలిపారు. 

కరెంట్​చూసి వాడుకోండి

విద్యుత్ శాఖ ఎండీ జితేశ్ పాటిల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 20 వేల మెగావాట్లకు చేరిందని, గ్రేటర్ హైదరాబాద్‌‌లో 4,063 మెగావాట్ల వినియోగం నమోదైందని తెలిపారు. సాయంత్రం 5 నుంచి రాత్రి10 గంటల వరకు విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుందని, అవసరానికి తగ్గట్టే విద్యుత్ వాడాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల ఉష్ణోగ్రతను 25 డిగ్రీల కంటే తక్కువకు తగ్గించకూడదని, సాయంత్రం 5 గంటల తర్వాత ఏసీలను నిలిపివేయాలని జయేశ్ రంజన్ సూచించారు. ఇంటి విద్యుత్ వైరింగ్‌‌ను తనిఖీ చేసుకోవాలని, విద్యుత్ పరికరాల అధిక వినియోగంతో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జితేశ్ పాటిల్ కోరారు. పైకప్పులపై సౌర విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేసుకునే వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు.

రోజుకు 7 వేల ట్యాంకర్ల బుకింగ్​

జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఎల్‌‌నినో ప్రభావం, భూగర్భ జలాల తగ్గుదలతో ప్రస్తుతం రోజుకు 7 వేలకు పైగా ట్యాంకర్ల కోసం బుకింగ్‌‌లు వస్తున్నాయని, రాబోయే 8 నెలలు జలమండలికి సవాళ్లతో కూడుకున్న కాలమని చెప్పారు. నగరంలోని 30 మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో ప్రస్తుతం 13 చోట్ల మాత్రమే నీటిని నింపుకునే కేంద్రాలున్నాయని, నవంబర్ 1 నుంచి అన్ని కేంద్రాల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 

మంజీరా, సింగూరు జలాశయాల్లోని నీటి నిల్వలు డిసెంబర్ వరకు సరిపోతాయని, ప్రస్తుతం ఆ జలాశయాల నుంచి నీటిని పొందుతున్న 3 లక్షల కనెక్షన్లకు జనవరి 1 నుంచి కృష్ణా, గోదావరి జలాలను సరఫరా చేస్తామని తెలిపారు. గోదావరి నుంచి అదనంగా రోజుకు 40 మిలియన్ గ్యాలన్ల నీటిని తీసుకోవాలని, కృష్ణా, జంట జలాశయాల నుంచి కూడా వీలైనంత ఎక్కువగా నీటిని తీసుకుంటామని చెప్పారు.

 నగర అవసరాలకు, అందుబాటులో ఉన్న సరఫరాకు రోజుకు 100 మిలియన్ గ్యాలన్ల అంతరాయం ఉందని, అదనంగా 60 మిలియన్ గ్యాలన్ల నీటిని సమకూర్చుకున్నా..మరో 40 మిలియన్ గ్యాలన్ల కొరత ఉండే అవకాశముందన్నారు. ప్రజలు 20 శాతం ఆదా చేస్తే సమస్యలను అధిగమించవచ్చన్నారు.