
హైదరాబాద్ : భార్యాభర్తలను నమ్మి, ఆశ్రయమిచ్చిన యజమానికే టోకరా వేసి రూ.63లక్షలు కాజేశారు. హైదరాబాద్ కు చెందిన రిటైర్డ్ IAS అధికారి గంగోపాధ్యాయ దగ్గర చిత్తూరు జిల్లాకు చెందిన వెంకట రమణ దంపతులు 2012 నుండి పని చేస్తున్నారు. అతని భార్య ఇంట్లో పని చేస్తుండగా… వెంకటరమణ కార్ డ్రైవర్ గా చేస్తున్నాడు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వయస్సు మీద పడటంతో బ్యాంక్ లావాదేవీలు వెంకట రమణతో చేయించేవాడు. ఇదే అదునుగా తీసుకున్న వెంకట రమణ.. యజమాని బ్యాంక్ వివరాలు సేకరించాడు. ఓ జిరాక్స్ షాప్ లో బ్యాంక్ వివరాలు లాగిన్ చేసి, అవసరం ఉన్నప్పుడల్లా నగదును ట్రాన్స్ ఫర్ చేసుకొనేవాడు. మనీ ట్రాన్స్ ఫర్ చేసి ఇస్తున్నందుకు జిరాక్స్ షాప్ యజమానికి కొంత కమిషన్ కూడా ఇచ్చేవాడు.
అకౌంట్లో నుండి ఏడాది కాలంలో 63 లక్షలు రూపాయలు ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు. అకౌంట్ ట్రాన్స్ ఫర్ చేసే సమయంలో ఐఏఎస్ అధికారి ఫోన్ కు వచ్చే OTPను వెంకటరమణ భార్య సహాయంతో తెలుసుకొని డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకొనేవాడు. ఇలా దొంగిలించిన డబ్బుతో వెంకట రమణ రెండు కార్లను కొనుగోలు చేశాడు. అకౌంట్ నుండి డబ్బులు ట్రాన్స్ ఫర్ అయినట్లు గమనించిన ఐఏఎస్ అధికారి సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు. అధికారి ఇంట్లో పనిచేసే వెంకటరమణనే ఈ లావాదేవీలు జరిపినట్లు బ్యాంక్ అకౌంట్ ఆధారంగా గుర్తించారు. పని మనిషితో పాటు భర్త అదుపులో తీసుకొని విచారించగా.. చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు సైబర్ క్రైమ్స్ అడిషనల్ డీసీపీ రఘువీర్ తెలిపారు. అతని దగ్గరి నుండి రెండు కార్లను సీజ్ చేసి.. రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు పోలీసులు.