
హైదరాబాద్, వెలుగు: గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపికను తొందరగా పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో ప్రత్యేక అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి తొందరగా లబ్ధిదారుల జాబితాను సేకరించాలని సూచించారు. దీనిపై ప్రతివారం సీఎస్ సమీక్ష నిర్వహిస్తున్నారని.. ఈ స్కీమ్ ప్రాధాన్యతను గుర్తించి పనిచేయాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నం.25 ప్రకారం దరఖాస్తుదారులకు ఆహార భద్రత, రేషన్ కార్డు ఉండాలన్నారు. స్థలం భార్య పేరు మీద ఉండాలన్నారు. భార్య చనిపోతే భర్తకు ఇస్తారని, సంబంధిత నియోజక వర్గంలో ఉండేవారు మాత్రమే అర్హులని తెలిపారు.
ఒకవేళ ఆర్ సీ రూఫ్ ఉన్న ఇల్లు అయితే జీవో 59 కింద లబ్ధి పొందిన వారు గృహలక్ష్మీ స్కీమ్ కు అనర్హులని ఆయన తెలిపారు. అర్హులైన వారు వెంటనే పోర్టల్ లో నమోదు చేసుకోవాలన్నారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం అర్హులైన వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. బేస్ మెంట్ పూర్తి చేస్తే రూ. లక్ష, స్లాబ్ పూర్తయితే మరో రూ. లక్ష, ఇల్లు పూర్తయిన వెంటనే మిగతా రూ.లక్షను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, డీఆర్వో వెంకటాచారి, సంబంధిత అధికారలు పాల్గొన్నారు.