హైదరాబాద్ సిటీ, వెలుగు: అర్హులైన పేదలకు ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఉండని వారికి నోటీసులివ్వాలని, ఆయా కుటుంబాలు ఇండ్లలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్శాఖ అధికారులను హైదరాబాద్కలెక్టర్హరిచందన ఆదేశించారు. భూమి ఉండి ఇంటి నిర్మాణాల కోసం అప్లై చేసుకున్న ఎల్ వన్ దరఖాస్తులపై బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్ఓ ఈ. వెంకటాచారి, హౌసింగ్ పీడీ అశోక్ చక్రవర్తితో కలిసి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తుల ఆధారంగా ఆయా ప్రాంతాలను పరిశీలించి సర్వే నిర్వహించి నివేదికలు అందజేయాలన్నారు.
మురికివాడల్లో ఇండ్ల నిర్మాణాలకు అనువుగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పాత హౌసింగ్ కాలనీలను గుర్తించి పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. ఆర్డీవోలు సాయిరాం, రామకృష్ణ, తహసీల్దార్లు పాల్గొన్నారు.
99 దుకాణాలను వేలంలో విక్రయించాలి
10 కాలనీల్లోని డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రాంగణాల్లో 99 దుకాణాలను వేలం పద్ధతిలో విక్రయించడానికి విధి విధానాలను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వేలానికి కనీస రేట్లు నిర్ణయించి 3 నుంచి 10 శాతం హామీ సొమ్మును ముందుగా జమ చేసేలా చూడాలన్నారు.
