పాటిగడ్డలో హైదరాబాద్​ కలెక్టరేట్​: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

పాటిగడ్డలో హైదరాబాద్​ కలెక్టరేట్​: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: ప్రజల అవసరాలకు సరిపడేలా అధునాతన సౌకర్యాలతో 13 ఎకరాల్లో హైదరాబాద్  కలెక్టరేట్  నిర్మిస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కలెక్టరేట్ నిర్మాణంపై శనివారం సచివాలయంలోని తన చాంబర్ లో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కలెక్టరేట్​ నిర్మాణానికి అనువుగా ఉన్న స్థలాల గురించి అడిగి తెలుసుకున్నారు.

హైదరాబాద్ జిల్లా కలెక్టర్  అనుదీప్  దురిశెట్టి.. కొత్త కలెక్టరేట్ భవనానికి అనువైన స్థలాలకు సంబంధించిన వివరాలను ప్రజంటేషన్  రూపంలో మంత్రికి వివరించారు. వీటితో పాటు ప్రస్తుత కలెక్టరేట్ లో ఏడు విభాగాలు మాత్రమే ఉన్నాయని, మిగతా 39  విభాగాలు వివిధ ప్రాంతాల్లోని అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడటంతో పాటు ప్రజలు తమ అవసరాల కోసం వివిధ కార్యాలయాల చుట్టూ తిరగడం చాలా ఇబ్బందిగా ఉందని మంత్రికి వివరించారు.

మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్  కలెక్టరేట్ నిర్మాణం నగర ప్రజల అవసరాలు తీర్చేలా నిర్మిస్తామన్నారు. అయితే, మిగతా స్థలాలతో పోలిస్తే పాటిగడ్డలో ఉన్న స్థలం నగరానికి నడిబొడ్డున ఉందని, ప్రజల రాకపోకలకు అందుబాటులో ఉంటుందన్నారు. అక్కడే కలెక్టరేట్  నిర్మించేందుకు స్థలపరిశీలన చేసి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.  గత బీఆర్ఎస్​ ప్రభుత్వం 10 లక్షల జనాభాలేని జిల్లాలకు కోట్లు ఖర్చుపెట్టి కొత్త కలెక్టరేట్లు నిర్మించిందని, కానీ కోటిమంది జనాభా నివసించే హైదరాబాద్ జిల్లాకు కలెక్టరేట్  నిర్మించకుండా నిర్లక్ష్యం చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు.