
పద్మారావునగర్, వెలుగు: ఖతర్ ఎయిర్ వేస్ కుహైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జరిమానా విధించింది. ఎక్కువ టికెట్ రేట్ఉన్న ఇంటర్నేషనల్ ఫ్లైట్ కు బదులు తక్కువ టికెట్ రేట్ఉన్న ఫ్లైట్ ను కేటాయించడంతో రూ.45 వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. సికింద్రాబాద్ నేరేడ్మెట్కు చెందిన పసుమూర్తి రమాకాంత్(73) తన మనవడికి యూరప్‌లో ఇంటర్నేషనల్ చెస్చాంపియన్ షిప్టోర్నీ ఉండడంతో గతేడాది జూన్‌లో అక్కడికి వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో బుడాపెస్ట్ నుంచి దోహా మీదుగా హైదరాబాద్ రావడానికి తనతోపాటు భార్య, మనవడికి కలిపి మూడు విమాన టికెట్లను ఖతర్ ఎయిర్ వేస్ నుంచి కొనుగోలు చేశారు. అయితే, బుడాపెస్ట్ ఎయిర్‌పోర్టులో వీరికి తక్కువ రేట్కలిగిన ఇండిగో ఫ్లైట్‌కు సంబంధించిన బోర్డింగ్ పాస్‌ను ఇష్యూ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇలా ప్లైట్ ను మార్చడంతో రమాకాంత్, ఆయన భార్య, మనవడు చాలా ఇబ్బందులు పడ్డారు. వయస్సు రీత్యా తాము సమస్యలు ఎదుర్కొన్నామని ఫిర్యాదు చేస్తూ రమాకాంత్ కన్జూమర్ ఫోరమ్ ను ఆశ్రయించగా, కమిషన్ఈ మేరకు తీర్పు చెప్పింది.