ధర్నాచౌక్​లో నిరసనలు చేయొచ్చు : సీపీ శ్రీనివాస్ రెడ్డి

ధర్నాచౌక్​లో నిరసనలు చేయొచ్చు : సీపీ శ్రీనివాస్ రెడ్డి
  • ధర్నాచౌక్​లో నిరసనలు చేయొచ్చు
  • సీఎం, మంత్రుల కాన్వాయ్ వెళ్లే టైమ్​లో ట్రాఫిక్ ఆపం: సీపీ శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్‌, వెలుగు : హైదరాబాద్ ఇందిరాపార్క్‌ వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను యథావిధిగా కొనసాగిస్తామని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజలు నిరసన తెలిపేందుకు ధర్నాచౌక్‌ వేది కగా ఉపయోగపడుతున్నదని పేర్కొన్నారు. ఎవరైనా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే పోలీసులకు ముందుస్తుగా సమాచారమిచ్చి అనుమతి తీసుకోవాలని సూచించారు. ధర్నాచౌక్‌, ఎన్టీఆర్‌‌ స్టేడియం పరిసరాలను సీపీ శుక్రవారం పరిశీలించారు. ధర్నాచౌక్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితిపై అధ్యయనం చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

‘‘ధర్నాచౌక్‌ను తరలించే విషయంలో కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టు తీర్పు కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే వస్తుందని ఆశిస్తున్నం” అని పేర్కొన్నారు. ‘‘ఇందిరాపార్క్‌ వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండేది. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, అశోక్‌నగర్‌‌ రూట్‌లో స్టీల్ బ్రిడ్జి నిర్మించడంతో ట్రాఫిక్ సమస్య కొంత మేరకు తగ్గింది. ఈ క్రమంలోనే సెక్రటేరియెట్, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ప్రజ లకు ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టించవద్దని సీఎం సూచించారు. 

సీఎం, మంత్రుల కాన్వాయ్‌ వెళ్లే సమయాల్లో ట్రాఫిక్ ను ఆపొద్దని అన్నారు. సీఎం సూచించిన విధంగా కాన్వాయ్‌ వెళ్లే సమయాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటాం. అదే సమయంలో సీఎం, మంత్రుల కాన్వాయ్‌ కి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తాం” అని చెప్పారు.