
హైదరాబాద్, వెలుగు: సిటీ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఆరోగ్యంపై సోమవారం పుకార్లు షికారు చేశాయి. బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ కమిషనరేట్ వద్ద అస్వస్థతకు గురయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో సీపీ సందీప్ శాండిల్య అప్రమత్తమయ్యారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. లోబీపీ, స్పాండిలైటిస్ కారణంగా రెగ్యూలర్ హెల్త్ చెకప్‌లో ఉన్నానని తెలిపారు. చెకప్‌లో భాగంగా శాండిల్య సోమవారం హైదర్‌గూడ అపోలో హాస్పిటల్‌కి వెళ్లారు.
అది గమనించిన కొంత మంది ఆయన అస్వస్థతకు గురయ్యారని ప్రచారం చేశారు. అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ ఇతర సీనియర్ అధికారులు అపోలో హాస్పిటల్‌కి వెళ్లారు. కాగా తాను అస్వస్థతకు గురైనట్లు జరిగిన ప్రచారాన్ని సీపీ ఖండించారు. సెల్ఫీ వీడియో ద్వారా తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. ఎలాంటి అస్వస్థతకు గురికాలేదని, రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే హాస్పిటల్‌కు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. మంగళవారం నుంచి యథావిధిగా డ్యూటీకి హాజరు అవుతానని ఆయన చెప్పారు.