
ఉప్పల్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్అసోసియేషన్ (హెచ్సీఏ)లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధ్యక్షుడు జగన్మోహన్ రావు, సీఈఓ, సెక్రటరీ, ప్యానెల్ సభ్యులను వెంటనే బర్తరఫ్ చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఉప్పల్ లోని హెచ్ సీఏ కార్యాలయం ఎదుట డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు.
హెచ్సీఏ అవినీతికి కేంద్రంగా మారిందని, జగన్మోహన్ రావు నకిలీ పత్రాలతో అధ్యక్షుడిగా ఎన్నికై, ఐపీఎల్ టికెట్లు, స్టేడియం పనుల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. హెచ్సీఏను ప్రక్షాళన చేసి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒక్క హైదరాబాద్లోనే 30 క్లబ్‌లు ఉన్నాయని, వాటిని రద్దు చేసి 33 జిల్లాలకు జిల్లా స్థాయి క్లబ్‌లు ఏర్పాటు చేసి, గ్రామీణ క్రీడాకారులకు కోచింగ్ అందించాలని కోరారు.