
ఖమ్మం టౌన్, వెలుగు : అంధుల పాఠశాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అంధులకు స్కూల్ ఏర్పాటుపై స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అంధులకు పాఠశాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. అంధుల పాఠశాలలో అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని చెప్పారు. వారి భద్రతను దృష్టిలో ఉంచుకొని పాఠశాల నిర్మాణం జరగాలని తెలిపారు.
పాఠశాలలో విద్యతోపాటు కంప్యూటర్ స్కిల్స్ అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అంధ విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. పాఠశాలల్లో సెన్సరీ రూమ్, సెన్సరీ గార్డెన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా తాగునీటి కనెక్షన్ అందించాలని చెప్పారు. సంప్ నిర్మాణం, మోటార్, విద్యుత్సరఫరా ఏర్పాటు చేయాలన్నారు. మలక్ పేటలోని అంధుల పాఠశాలను, దేవనార్ పాఠశాలను అధికారులు సందర్శించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈవో దీక్షా రైనా, సీఎంవో ప్రవీణ్, స్పెషల్ ఎడ్యుకేటర్ రాకేశ్, అధికారులు పాల్గొన్నారు.