బ్యాంక్ FDలో 20 ఏళ్లకు రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే వచ్చే లాభం సున్నా..! ఎందుకంటే..?

బ్యాంక్ FDలో 20 ఏళ్లకు రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే వచ్చే లాభం సున్నా..! ఎందుకంటే..?

భారతదేశంలో ప్రజలు ఇప్పటికీ ఎక్కువగా రిస్క్ తక్కువ ఉండే పెట్టుబడులపైనే దృష్టి కొనసాగుతోంది. ఈ క్రమంలో కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా సురక్షితమైన, రిస్క్ లేని బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో తమ డబ్బును దాచుకోవటానికి ఇష్టపడుతుంటారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన సంపాదనలో 80 నుంచి 90 శాతం వరకు ప్రభుత్వ ఆధీనంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద FD రూపంలో పెట్టుబడిగా పెట్టారు. టర్మ్ డిపాజిట్ల వల్ల రక్షణ ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో వాటి నుంచి పొందే ప్రయోజనం ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు చాలా తక్కువనే విషయాన్ని ప్రజలు గుర్తించటం లేదు. 

ఈ ఏడాది రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేటు రెపో రేటును తగ్గించిన తర్వాత బ్యాంకింగ్ సంస్థలు కూడా దానికి అనుగుణంగానే తమ వడ్డీ రేట్లలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లకు 4 శాతం నుంచి 6.5 శాతం వరకు వడ్డీ రేట్లు కాలానుగుణంగా అందించబడుతున్నాయి. స్థిరమైన రాబడుల కోసం చాలా మంది గడువు ముగిసిన తర్వాత కూడా మళ్లీ ఆ డబ్బును తిరిగి ఎఫ్ డి చేస్తుంటారు భారతదేశంలో. 

ALSO READ : గురువారం తగ్గిన గోల్డ్-సిల్వర్.. 

 

వాస్తవానికి దేశంలో ఉన్న ద్రవ్యోల్బణం రేటు కంటే రిటర్న్ ఎక్కువగా ఉండే పెట్టుబడుల్లో డబ్బును పెట్టినప్పుడు అది నిజంగా వృద్ధి చెందుతుంది. ద్రవ్యోల్బణం తెలియకుండానే సంపద విలువను కాలక్రమేణా తినేస్తుంటుంది. దీనివల్ల ప్రజల వద్ద ఉండే డబ్బుకు కొనుగోలు శక్తి క్షీణిస్తుంటుంది. ఉదాహణకు 10 ఏళ్ల కిందట రూ.100 కు వచ్చిన వస్తువు ప్రస్తుతం కొనాలంటే ఇంకా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు రూపాయితో వచ్చే వస్తువులు కూడా 20 ఏళ్ల తర్వాత రేట్లు పెరిగుదల కారణంగా కొనాలంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సిందే. అందువల్ల ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ రేటు రిటర్న్ ఇచ్చే పెట్టుబడుల్లో డబ్బు ఇన్వెస్ట్ చేయటం వల్ల అది డబ్బు విలువను పెంచుతుంది. 

ఒక వ్యక్తి 20 ఏళ్ల కాలానికి రూ.5లక్షల మెుత్తాన్ని 5.5 శాతం వడ్డీ రేటుకు ఏదైనా బ్యాంకులో డిపాజిట్ చేస్తే మెచ్చూరిటీ సమయంలో అతనికి రూ.14లక్షల 90వేలు తిరిగి వస్తాయి. అలాగే 20 ఏళ్ల తర్వాత 6 శాతం ద్రవ్యోల్బణం రేటు ప్రకారం రూ.5 లక్షలతో ప్రస్తుతం వచ్చే వస్తువులు కొనాలంటే రూ.16లక్షల 03వేల వరకు ఖర్చవుతుంది. ఇక్కడ నిజంగా చూసుకుంటే ద్రవ్యోల్బణం కంటే బ్యాంక్ ఇస్తున్న వడ్డీ రేటు తక్కువగా ఉండటంతో సంపద విలువ మార్కెట్ ఖర్చుల కంటే వెనకబడింది. అందుకే ప్రజలు దేశంలో ఉన్న ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చే పెట్టుబడి సాధనాలను ఎంచుకున్నప్పుడే వారి సంపద నిజంగా పెరుగుతుందని అది భవిష్యత్తు ఖర్చులకు ఉపయోగపడుతుందని గమనించాలి.