- నేడు ప్రీ బిడ్ సమావేశం
- 29న బిడ్ల ఓపెన్
హైదరాబాద్ సిటీ, వెలుగు : సీఆర్ఎంపీ (కాంప్రెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రొగ్రాం) సెకండ్ ఫేజ్ పనులు నెల రోజుల్లో ప్రారంభం కానున్నాయి. కోర్ అర్బన్ రీజియన్(క్యూర్) పరిధిలోని మూడు కార్పొరేషన్లలో రూ.3,145 కోట్ల వ్యయంతో 1,014 కిలోమీటర్ల పొడువున10 ఏండ్ల నిర్వహణ కోసం బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.
గురువారం ప్రీ బిడ్ సమావేశం జరగనుంది. ఈ నెల 29న బిడ్లను ఓపెన్ చేయనున్నారు. ప్రస్తుతం మూడు కార్పొరేషన్ల పరిధిలో ఎక్కడ చూసినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గుంతలు పడ్డా రిపేర్లు చేయట్లేదు. మరోవైపు పైప్లైన్ పనులు, డ్రైనేజీ, కేబుల్స్, కరెంట్లైన్ల కోసమంటూ రోడ్లు తవ్వుతున్న ఆయా శాఖలు పనులు పూర్తయ్యాక తిరిగి రిపేర్లు చేయడం లేదు. కొన్నిచోట్ల మట్టిపోసి పోతుండగా, మరికొన్ని ఏరియాల్లో అలాగే వదిలేస్తున్నారు. టెండర్ల బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయా రోడ్ల రికార్పెటింగ్, క్లీనింగ్, ఫుట్ పాత్ ల నిర్వహణ ఇలా అన్నీ ఏజెన్సీలు చూసుకోనున్నాయి. వాస్తవానికి ఈ పనులన్నీ వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాల్సి ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆలస్యమైంది.
బాధ్యతలు జీహెచ్ఎంసీకే ..
మూడు కార్పొరేషన్లలో సీఆర్ఎంపీ టెండర్లకు సంబంధించి జీహెచ్ఎంసీనే ఫైనల్ చేస్తుంది. ఏజెన్సీలు ఎంపికయ్యాక ఆయా కార్పొరేషన్లే బాధ్యతలు చూసుకోనున్నాయి. పదేండ్ల నిర్వహణకు జీహెచ్ఎంసీ పరిధిలో 471కిలోమీటర్లకు రూ.1,459 కోట్లు, ఎంఎంసీలో 287 కిలోమీటర్లకి రూ.890 కోట్లు , సీఎంసీలో 256 కిలోమీటర్లకు రూ.796 కోట్లు ఇవ్వనున్నారు.
