హైదరాబాద్ లో 23 కి.మీ.ల సైక్లింగ్ ట్రాక్.. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే..

హైదరాబాద్ లో 23 కి.మీ.ల సైక్లింగ్ ట్రాక్.. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే..

హైదరాబాద్​ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) వెంట సోలార్‌ రూఫింగ్‌తో కూడిన 23 కిలోమీటర్ల సైక్లింగ్‌ ట్రాక్‌ను సెప్టెంబర్‌ మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అరవింద్ కుమార్ తెలిపారు.  

నిర్మాణంలో ఉన్న ట్రాక్​ని ఆయన అధికారులతో కలిసి ఆగస్టు 11న పరిశీలించారు. ప్రాజెక్టు చివరి దశలో ఉందని తుది మెరుగులు దిద్దుతున్నట్లు అరవింద్ వెల్లడించారు. మరో రెండు వారాల్లో పనులు పూర్తి కానున్నట్లు వివరించారు. ట్రాక్​సంబంధించిన ఫొటోలను ఆయన ట్విటర్​లో షేర్​ చేశారు. 

ఆహ్లాదకర వాతావరణంలో  ఉన్న ఈ ట్రాక్ తో సిటీ రింగు రోడ్డు పరిధిలోఉన్న యువత నిత్యం సైక్లింగ్​ చేసి ఆరోగ్యాల్ని కాపాడుకోవచ్చని అన్నారు. యూత్​ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

నానక్‌రామ్‌గూడ నుంచి తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ వరకు 8.45 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు 13.8 కిలోమీటర్ల మేర ట్రాక్‌ పూర్తయింది.  నిర్మాణం పూర్తయి పూర్తిగా అందుబాటులోకి వచ్చాక IT హబ్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాలను ఇది కవర్​ చేయనుంది.  

ముగ్గురు సైక్లర్లు ఒకే సారి వెళ్లే విధంగా దీన్ని డిజైన్​ చేశారు. చుట్టూ పచ్చని చెట్లు, పూల వనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.