
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖైరతాబాద్గణేశ్ దర్శనానికి గురువారం ఒక్కరోజే సుమారు 5 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లన్నీ రద్దీగా మారాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు అదే ఫ్లో కనిపించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో స్టేషన్ దిగిన వెంటనే క్యూ లైన్ప్రారంభించారు. అది కూడా పూర్తిగా నిండిపోయింది.
మెట్రో రైల్ అధికారులు అదనపు సర్వీసులను కూడా నడిపారు. గణేశుడి మండప పరిసరాల్లో రద్దీని నియంత్రించేందుకు ఆలయం వద్ద 500 మంది పోలీసులు, 200 మంది వలంటీర్లను బందోబస్తుగా ఉంచారు. భక్తులకు ఉచితంగా ప్రసాదం, నీరు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. కాగా..సీఎం రేవంత్ రెడ్డి బిడ్డ నైమిషా, మనవడు రియాన్స్ రెడ్డి గురువారం బడా గణేశుడిని దర్శించుకున్నారు. మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.