వంద శాతం ఓటింగ్ నమోదయ్యేలా పనిచేస్తాం : రోనాల్డ్ రాస్

వంద శాతం ఓటింగ్ నమోదయ్యేలా పనిచేస్తాం : రోనాల్డ్ రాస్
  • తుది ఓటర్ జాబితాలో మార్పులకు అవకాశం
  • ఈ ఎన్నికలకు కొవిడ్‌‌‌‌ రూల్స్‌‌‌‌ పాటించాల్సిందే 
  • హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ జిల్లాలో వందశాతం ఓటింగ్ నమోదుకు తుది ఓటరు జాబితాను ప్రక్షాళన చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు.  సోమవారం బల్దియా హెడ్డాఫీసులోని  పన్వర్ హాల్‌‌‌‌లో ఓటింగ్ అవేర్ నెస్,  ఎన్నికల నిర్వహణపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ.. అక్టోబర్ 4న తుది ఓటర్ జాబితా వచ్చినప్పటికీ..  కొత్తగా అర్హులైన 18 ఏండ్లు నిండిన వారు ఫారం -6  ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు.  నూతన ఓటరు నమోదు,  ఓటరు జాబితాలో  పేర్ల తప్పులు, ఇల్లు షిఫ్ట్ అయిన వారు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించిందన్నారు.

ఇప్పటికైనా ఓటరు జాబితాలో పేర్లు లేనివారు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు.  ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో రీచెక్ చేసుకోవాలని అన్నారు. అందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1950,  ఓటర్ హెల్ప్ లైన్ లేదా voter.eci.gov.in వెబ్ సైట్ లేదా మీ దగ్గరలోని బీఎల్వోలను సంప్రదించవచ్చన్నారు.  ఓటరు తుది జాబితా విడుదలైన తర్వాత అక్టోబర్ 9 నాటికి 44,680 డెత్, డూప్లికేట్ ఓట్లను తొలగించామని తెలిపారు.  నాలుగు నెలల నుంచి ఒకే కుటుంబ సభ్యుల పేర్లు అదే నియోజకవర్గంలో వేర్వేరు పోలింగ్ స్టేషన్లలో ఉన్న 3,56,830 ఓట్లను సరి చేశామన్నారు.  

నామినేషన్ ముగిసిన తర్వాత ఇంటింటికి వెళ్లి ఓటరు స్లిప్‌‌‌‌లను పంపిణీ చేస్తామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌‌‌‌లు ఇప్పటి వరకు రూ. 70 లక్షల నగదును సీజ్ చేశారన్నారు. పోలీసు సిబ్బంది రూ.18.9 కోట్లను సీజ్ చేశారన్నారు. 2,300 లీటర్ల లిక్కర్‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నామని, 128 కేసులు బుక్ చేశామని తెలిపారు.  సమావేశంలో డిప్యూటీ ఎన్నికల అధికారి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, అడిషనల్ కమిషనర్ ఎలక్షన్ శంకరయ్య, డిప్యూటీ ఈఈ అనంతం తదితరులు పాల్గొన్నారు.