అయ్యో.. మోసపోయానా ?.. సైబర్ ఫ్రాడ్ విషయంలో అవగాహన లేక మోసపోయిన 82 ఏండ్ల వృద్ధుడు

అయ్యో.. మోసపోయానా ?.. సైబర్ ఫ్రాడ్ విషయంలో అవగాహన లేక మోసపోయిన 82 ఏండ్ల వృద్ధుడు
  • డిజిటల్ అరెస్ట్ పేరిట రూ. 72 లక్షలు కొట్టేసిన స్కామర్స్
  • న్యూస్ ఆర్టికల్స్ చూసి పోలీసులకు ఫిర్యాదు

బషీర్​బాగ్, వెలుగు: డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించి ఓ వయో వృద్ధుడి నుంచి సైబర్ చీటర్స్ రూ.72 లక్షలు కొట్టేశారు. సైబర్ ఫ్రాడ్ విషయంలో అవగాహన లేని వృద్ధుడు.. ఇదో మోసమని న్యూస్ ఆర్టికల్స్ చూసే అంత వరకు గ్రహించలేకపోయాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం..  ఆగస్టు 11న బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన 82 ఏండ్ల వృద్ధుడికి తొలుత స్కామర్స్ వాట్సాప్ నుంచి వీడియో కాల్ చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నట్లు తెలిపారు. 

ఓ మనీలాండరింగ్ కేసులో బాధిత వృద్ధుడి ఆధార్ కార్డు ఉపయోగించినట్లు ఆరోపించారు. ఈ కేసులో బాధితుడి అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తామని, డిజిటల్ అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. కేసు నుంచి బయటపడాలంటే బాధితుడి అకౌంట్స్, ఫిక్స్డ్​డిపాజిట్ లలో ఉన్న డబ్బులను పంపించాలని, వాటిని వేరిఫై చేసి తిరిగి పంపిస్తామని స్కామర్స్ తెలిపారు. బాధిత వృద్ధుడు భయపడి అతని ఫిక్స్డ్​డిపాజిట్ లను బ్రేక్ చేసి , రూ.72 లక్షలను స్కామర్స్ అకౌంట్ కు బదిలీ చేసి, సైలెంట్​గా ఉన్నాడు. ఇటీవల ఇదే తరహా సైబర్ ఫ్రాడ్ కేసుల విషయం న్యూస్ ఆర్టికల్స్ లో రావడంతో మోసపోయినట్లు గ్రహించి, శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసం 

మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయం చేసుకుని, క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ పేరిట ఓ వ్యక్తిని సైబర్ చీటర్స్ మోసగించారు. పంజాగుట్టకు చెందిన 31 ఏండ్ల వ్యక్తికి స్కామర్స్ రెడ్డి మ్యాట్రిమోనీలో ఓ మహిళ ప్రొఫైల్​తో సంప్రదించారు. తాను స్కాట్లాండ్ లో ఉంటానని, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లో అధిక లాభాలను ఆర్జిస్తున్నట్లు బాధితుడితో వాట్సాప్ లో చాట్ చేశారు. బాధితుడికి నమ్మకం కలిగేలా లాభాలు వచ్చినట్లు ఫేక్ మెసేజెస్ షేర్ చేశారు. అనంతరం స్కామర్స్ బాధితుడితో బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేయించడానికి ఒప్పించారు. బాధితుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా పలు కరెంట్ అకౌంట్స్ కు డబ్బులను బదిలీ చేశాడు. స్కామర్స్ ఇంకా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో స్కామ్ అని గ్రహించి, మొత్తం రూ. 11,04,000 లు పోగొట్టుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.