హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోని దిగ్గజ ఫైనాన్షిలయ్ సంస్థలన్నీ తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రతిభ కలిగిన యువత, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సమస్య లేని రోడ్లు, అందుబాటులో ఉండే అద్దెలు ప్రముఖ కంపెనీలను ఆకర్షిస్తున్నాయన్నారు. న్యూయార్క్‌కు చెందిన పీకో టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు శనివారం సెక్రటేరియెట్‌లో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో సమావేశమయ్యారు.
ఫైనాన్షియల్ మార్కెట్ సేవలు అందించే పికో టెక్నోలజీ సంస్థ హైదరాబాద్‌లో జీసీసీని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ సంసర్భంగా శ్రీధర్ బాబు వారికి ఇక్కడి అవకాశాలు, మౌలిక వసతుల గురించి వివరించారు. రాబోయే 20 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. బెంగళూరు, ముంబై నగరాలతో పోలిస్తే ఇక్కడ ఆఫీసు స్థలాల ఆక్యుపెన్సీ 73 శాతం ఉందని చెప్పారు. ముంబైలో అది 52 శాతం మాత్రమేనన్నారు.
బెంగళూరు, ముంబై మెట్రో నగరాల్లో ట్రాఫిక్, వాయు కాలుష్యం ప్రధాన సమస్యలుగా మారడంతో ఐటీ సంస్థలు, జీసీసీలు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయని ఆయన చెప్పారు. ఓఆర్ఆర్కు 30 కిలోమీటర్ల అవతల రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నట్టు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. దానికి అనుబంధంగా రేడియల్ రోడ్లు ఏర్పాటవుతున్నాయని వివరించారు. రింగ్ రోడ్ల పక్కన రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసి రవాణా సదుపాయాలను ప్రపంచంలోని పెద్ద నగరాలను తలదన్నేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
హయత్ నగర్–ఎల్బీనగర్ ల మధ్య డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. కింది రోడ్డు స్థానిక ట్రాఫిక్ అవసరాలకు వినియోగిస్తామని, పైన ఉండే రెండు అంతస్థుల రోడ్లు నగరం నుంచి బయటకు వెళ్లే వాహనాలు, బయటి నుంచి లోపలికి వచ్చే వాహనాల కోసం వినియోగిస్తామన్నారు. నాగ్‌పూర్ తర్వాత డబుల్ డెక్కర్ రోడ్లు నిర్మిస్తున్న నగరం హైదరాబాదే అన్నారు. రెండు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
ఈ సమావేశంలో పీకో టెక్నాలజీ సీఈవో జారెడ్ యుస్టర్ , పీకో ఇండియా సీఈవో హరి కోదండరామన్, డైరెక్టర్ సీతారాం తదితరులు పాల్గొన్నారు. కోటి టీవీలను ఉత్పత్తి చేసిన రేడియంట్ అప్లయన్సెస్ ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని శ్రీధర్ బాబు చెప్పారు. కార్యక్రమంలో రెజల్యూట్ గ్రూప్ చైర్మన్ రమీందర్ సింగ్ సోయిన్, డైరెక్టర్ మణికందన్, లీగల్ అండ్ ఐపీఆర్ హెడ్ శుభజిత్ సాహా, అడ్మినిస్ట్రేషన్ హెడ్ నోయెల్ రాబిన్ సన్ తదితరులు పాల్గొన్నారు.
