
- సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌కు కృతజ్ఞతలు తెలిపిన నేతలు
హైదరాబాద్, వెలుగు: ప్రమోషన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని జోన్ల వాళ్లకూ సమాన ప్రాధాన్యం ఇస్తున్నదని హైదరాబాద్ఇంజనీర్ల సంఘం (హెచ్ఈఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాపోలు రవీందర్, చక్రధర్అన్నారు. 25 ఏండ్లుగా ఒకే ప్రాంతానికి చెందిన అధికారులే ఈఎన్సీలు, సీఈలుగా ఉంటున్నారని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ తేడాలు తగ్గించాలంటూ ఈఎన్సీకి ఆదేశాలిచ్చిందని గుర్తు చేశారు. ప్రతిభ ఆధారంగానే ప్రమోషన్లు ఇస్తామంటూ శనివారం ఓ ప్రకటనలో కొనియాడారు.
ప్రభుత్వం తాజాగా ఇచ్చిన 8 సీఈ ప్రమోషన్లలో జోన్ 5, జోన్ 6 అధికారులకు సమ ప్రాధాన్యం దక్కిందన్నారు. గత పదేండ్లలో డీపీసీ ద్వారా ఈఈ, ఆపై స్థాయి క్యాడర్ల ప్రమోషన్లను ఏ ఇంజనీర్ కూడా చూడలేదన్నారు. 33 ఏండ్ల తర్వాత రేవంత్ ప్రభుత్వమే డీపీసీ ద్వారా తమ ప్రమోషన్లను సీనియారిటీ, ప్రతిభ ఆధారంగా పారదర్శకంగా ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికే 177 మందికి ప్రమోషన్ఇచ్చారని, మరో 85 మందికి ఇవ్వబోతున్నదని అన్నారు.
తమకు ప్రమోషన్లు ఇచ్చినందుకు, ఎక్స్టెన్షన్లు లేకుండా చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సలహాదారు ఆదిత్యా నాథ్ దాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్‌లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. హెచ్ఈఏ పూర్వ అధ్యక్షుడు మహేందర్, ఏఎస్ఎన్ రెడ్డి, ట్రెజరర్ ఆంజనేయులు తదితరులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.