3 గంటలు.. 87 మంది ఫైర్​ఫైటర్స్..​గుల్జార్​హౌస్​ సమీప బిల్డింగ్​లో చిక్కుకున్న నలుగురి ప్రాణాలు కాపాడిన సిబ్బంది

3 గంటలు.. 87 మంది ఫైర్​ఫైటర్స్..​గుల్జార్​హౌస్​ సమీప బిల్డింగ్​లో చిక్కుకున్న నలుగురి ప్రాణాలు కాపాడిన సిబ్బంది
  • గోడకు రంధ్రం చేసి రెస్క్యూ ఆపరేషన్​
  • 11 ఫైర్​స్టేషన్ల నుంచి 10 ఫైరింజన్ల వినియోగం 
  • 55,500 లీటర్ల నీళ్లతో మంటలు ఆర్పివేత

హైదరాబాద్ సిటీ, వెలుగు:గుల్జార్ హౌస్​సమీపంలోని బిల్డింగ్​లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఫైర్​ఫైటర్స్​సుమారు మూడున్నర గంటలకు పైగా కష్టపడ్డారు. మొత్తం 11 వాహనాలు, ఒక ఫైర్ రోబో తో  17 మంది అధికారులు, 70 సిబ్బంది ఈ రెస్క్యూ ఆపరేషన్​లో పాల్గొన్నారు. అడ్వాన్స్​డ్​​ఫైర్‌‌‌‌‌‌‌‌ రోబోతో పాటు ఒక బ్రాంటో స్కైలిఫ్ట్ హైడ్రాలిక్  యంత్రాన్ని తెచ్చినా  వీటి  అవసరం రాలేదు. ఉదయం ఆరున్నర గంటలకు మొదలుపెట్టిన రెస్క్యూను 10.30 గంటలకు పూర్తి చేశారు.

ఈ సందర్భంగా ఫైర్ సిబ్బంది నలుగురి ప్రాణాలను  కాపాడారు. బిల్డింగ్ పైన ఉన్న వారిని ల్యాడర్ ద్వారా కిందకు తీసుకువచ్చారు. పై అంతస్తులకు వెళ్లేందుకు ఒకటే దారి (మెట్లు) ఉండటం, అదికూడా ఒక మీటర్ కన్నా తక్కువ వెడల్పుతో భవనం మధ్యలో ఉండటంతో రెస్క్యూకి ఇబ్బంది అయింది. ప్రత్యామ్నాయ మెట్లు, మార్గాలు లేకపోవడంతో  ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంటలు గ్రౌండ్ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌లో మొదలుకావడంతో పొగలు పై అంతస్తులకు వేగంగా వ్యాపించాయి.

రోడ్డు వైపు  కిటికీలు, తలుపులు లేకపోవడంతో  హైడ్రాలిక్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ వినియోగంలో ఆటంకం ఏర్పడింది. దీంతో బాధితులను కాపాడేందుకు ఫైర్ సిబ్బంది మొదటి అంతస్తు గోడలో రంధ్రం చేయాల్సి వచ్చింది. ఫైర్ సిబ్బందితోపాటు  పోలీస్, జీహెచ్ఎంసీ, హెల్త్, హైడ్రా, రెవెన్యూ అధికారులు ఈ రెస్క్యూలో పాల్గొన్నారు. 

 రెస్క్యూ ఇలా..

ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని ఉదయం 6.16 గంటలకు కాల్ రాగానే, 6.17 గంటలకు మొఘల్‌‌‌‌‌‌‌‌పురా నుంచి మల్టీపర్పస్​వాటర్ టెండర్ ఫైరింజన్​బయలుదేరింది. సంఘటనా స్థలానికి 6.20 గంటలకు చేరుకున్నామని ఫైర్​సేఫ్టీ సిబ్బంది చెప్తున్నారు. అయితే, ఆరున్నర గంటలకు వచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొదటి వెహికల్​లో ఆక్సిజన్ ఎక్విప్​మెంట్​వెంట తీసుకురాకపోవడంతో ఫైర్ సిబ్బంది లోపలకు వెళ్లలేకపోయారు. దీంతో నీళ్లు  కొట్టడం మొదలుపెట్టినా లోపలకు వెళ్లడానికి మాత్రం వెయిట్​చేశారు. 

ఒక్కొక్కటిగా వచ్చిన ఫైరింజన్లు 

హైకోర్టు నుంచి 6.26 గంటలకు వాటర్ టెండర్ ఫైరింజన్, 6.28గంటలకు గౌలిగూడ నుంచి వాటర్ బోజర్ ట్యాంకర్, సాలర్ జంగ్ మ్యూజియం నుంచి 6:56 గంటలకు మరో వాటర్ టెండర్, చందులాల్ బారాదరి నుంచి 7.01 గంటలకు మల్టీపర్పస్ టెండర్ ఫైరింజన్ వచ్చాయి.   7:25 గంటలకు ఎల్‌‌‌‌‌‌‌‌బీనగర్ నుంచి రెస్క్యూకి కావాల్సిన సామగ్రితో పాటు కట్టర్, బ్రీతింగ్ ఇతర పరికరాలతో రెస్క్యూ టెండర్ వచ్చింది.  7.38 గంటలకు గాంధీ అవుట్ పోస్ట్ నుంచి వాటర్ బ్రోజర్, 7.41 గంటలకు హెచ్​పీఎఫ్ 101 ఫైర్ స్టేషన్ నుంచి మరో రెస్య్కూ టెండర్, 7.44 గంటలకు రాజేంద్ర నగర్ నుంచి వాటర్ బ్రోజర్, 7.49 గంటలకు  సెక్రటేరియట్ నుంచి బొకారో స్టీల్ ప్లాంట్ (బీఎస్ఎల్) హైడ్రాలిక్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ తో కూడిన యంత్రం వచ్చింది.

7.50 గంటలకు లంగర్ హౌస్ నుంచి మరో మల్టీపర్పస్ టెండర్ ఫైరింజన్​తీసుకొచ్చారు.  మొత్తంగా రెండు వాటర్ టెండర్లలో 4,500 లీటర్ల చొప్పున 9 వేల లీటర్ల నీళ్ల కెపాసిటీ ఉండగా, 4,500 లీటర్ల కెపాసిటీతో ఉన్న మరో 3 మల్టీపర్పస్​టెండర్​ఫైరింజన్లతో  పాటు 3 వాటర్ బ్రోజర్ ఫైరింజన్లలో 9వేలు, 10వేలు, 14వేలు లీటర్ల నీళ్ల సామర్థం గల ఫైరింజన్లు, మరో రెండు రెస్క్యూ టెండర్లతో మంటలు ఆర్పివేశారు. మొత్తంగా 55,500 లీటర్ల నీళ్లతో రెస్క్యూ ఆపరేషన్​చేశారు.