ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కావలెను .. హైదరాబాద్ లో లక్షన్నర వరకు హోటళ్లు, రెస్టారెంట్లు.. సర్కిల్​కు కనీసం ఇద్దరు అవసరం

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కావలెను .. హైదరాబాద్ లో  లక్షన్నర వరకు హోటళ్లు, రెస్టారెంట్లు.. సర్కిల్​కు కనీసం ఇద్దరు అవసరం
  • వీటన్నింటిలో తనిఖీలకు ఉన్నది 27 మంది మాత్రమే 
  • ఒక్కొక్కరు నెలకి 30 శాంపిల్స్​సేకరిస్తేనే కల్తీకి చెక్​ 
  • కొత్త ల్యాబ్​లు ఏర్పాటైతేనే సమస్య తీరేది

హైదరాబాద్ సిటీ, వెలుగు: మహానగరంలో ఆహార నాణ్యతను చెక్​చేసే ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరత వేధిస్తున్నది. గ్రేటర్ లో హోటల్స్, రెస్టారెంట్లు కలిపి లక్షల్లో ఉండగా, కేవలం 58 వేల ఫుడ్ లైసెన్సులు మాత్రమే ఉన్నాయి. ఇందులో చాలా మంది నిర్వాహకులు నాణ్యత పాటించడం లేదు. కుళ్లిన మాంసం, కూరగాయలు, సింథటిక్​కలర్స్, నిల్వ చేసిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు వాడుతూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

ఇలాంటి వాటికి చెక్​పెట్టడానికి బల్దియాలో ఫుడ్​సేఫ్టీ వింగ్​పని చేస్తోంది. అనుమానం ఉన్న, ఫిర్యాదులు వచ్చిన రెస్టారెంట్లు, హోటల్స్​లో ఆహార నాణ్యత తనిఖీలు నిర్వహించేందుకు బల్దియాలో తక్కువలో తక్కువ కనీసం సర్కిల్ కి ఇద్దరు చొప్పున ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉండాలి. 30 సర్కిల్స్ కి 60 మంది అవసరం ఉంటుంది. కానీ, 27 మంది మాత్రమే ఉండడంతో ఆశించిన మేర ఫలితాలు సాధించలేకపోతున్నారు.

ఈ సంవత్సరం జనవరి నెల నుంచి మార్చి31 వరకు అంటే మూడు నెలల్లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు 2881 హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు చేసి 649 శ్యాంపిల్స్ సేకరించారు. ఇందులో 23 శాంపిల్స్​నాణ్యత లేనివిగా రిపోర్ట్ రాగా, ఆరు శాంపిల్స్​ఆరోగ్యానికి ప్రమాదకరం అని నివేదిక వచ్చింది. ఏప్రిల్​లో  తనిఖీలు నిర్వహించామని, పెర్ఫార్మెన్స్​రిపోర్ట్​ఇంకా రెడీ కాలేదని అధికారులు చెప్తున్నారు. తనిఖీలు చేసిన హోటల్స్​, రెస్టారెంట్ల సంఖ్య తక్కువే అయినా..రిపోర్ట్​ రావడంలోనూ ఆలస్యం అవుతోందని చెప్తున్నారు. 

రాష్ట్రానికి అంతటికీ ఒకే ల్యాబ్

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) రూల్స్ ప్రకారం ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్​తనిఖీలు చేసి నెలకు ఐదు ఎన్ ఫోర్స్ మెంట్ శాంపిల్స్, 25 సర్వేలెన్స్ శాంపిల్స్​సేకరించాలి. రెండు కూడా క్వాలిటీ కోసం తీసుకునేవే అయినా ఎన్ ఫోర్స్ మెంట్ శాంపిల్స్​వల్ల ల్యాబ్ రిపోర్టు త్వరగా వస్తుంది. సర్వేలైన్స్ రిపోర్ట్​లో క్వాలిటీ గురించి కంప్లీట్​ఇన్ఫర్మేషన్​వస్తుంది. ఎన్​ఫోర్స్​మెంట్ శాంపిల్స్​కు తక్కువ టైం, సర్వేలెన్స్​రిపోర్ట్​కు కాస్త ఎక్కువ టైం పడుతుంది.

అయితే, మన రాష్ట్రంలో సేకరించిన అన్ని ఫుడ్ శ్యాంపిల్స్ ను పరిశీలించేందుకు నాచారంలో ఒకే ఒక్క ల్యాబ్ ఉంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఈ ఒక్క ల్యాబ్ మాత్రమే కొనసాగుతోంది. ఇందులో వారానికి 150 శాంపిల్స్​మాత్రమే టెస్ట్​చేసే అవకాశం ఉంది. ఇందులో 75 శాతం జీహెచ్ఎంసీ నుంచి పంపిస్తున్నవే ఉన్నాయి.  అయినా, ఈ శాంపిల్స్​లో కొన్నింటి రిపోర్టులు రావడం లేదు. ఉన్నది ఒక్కటే ల్యాబ్​కావడం, సిబ్బంది తక్కువ కావడంతో ఉన్నవారిపై లోడ్​ ఎక్కువవుతోంది.

ల్యాబ్​లో సైంటిస్టులు, ఇతర ఉద్యోగులు కలిపి 78 పోస్టులు శాంక్షన్​కాగా, కేవలం 11 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఎంతో కీలకమైన ఈ ల్యాబ్ లో  67 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.దీంతో పాటు గ్రేటర్ అంతా కలిపి ఒకే ఒక్క మొబైల్ ఫుడ్ టెస్టింగ్ వ్యాన్ ఉంది. దీంతో పాటు మరో ఐదు వ్యాన్లు కొన్నా ఎక్విప్​మెంట్​ఏర్పాటు చేయడంతో ఆలస్యమవుతోంది. దీంతో ఉన్న ఒక్క వాహనంతో ప్రయోజనం లేకుండా పోతుంది.  ప్రస్తుత కాంగ్రెస్​సర్కారు కొత్త ల్యాబ్​లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ పరిస్థితి మారుతుందని భావిస్తున్నారు.   

ఆరు మినీ ల్యాబ్ లు ఏర్పాటైతే..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ల్యాబ్ ల సంఖ్యను పెంచకపోవడంతో ఆహారకల్తీపై పెద్దగా చర్యలు తీసుకోలేకపోయారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్​ప్రభుత్వం గ్రేటర్ లోని ఆరు జోన్లకి సంబంధించి ఆరు మినీ ల్యాబ్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ల్యాబ్ లను ఏర్పాటు చేసేందుకు స్థలాలు కేటాయించాలని బల్దియాను ప్రభుత్వం కోరింది. సాధ్యమైనంత త్వరగా స్థలాలు చూపించడంతో పాటు ల్యాబ్ లను వెంటనే ఏర్పాటు చేయించేలా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల నాచారం ల్యాబ్ పై లోడ్ తగ్గనుంది. 

త్వరలో ఖాళీల భర్తీ...

సర్కిల్ కి ఇద్దరు చొప్పున 60 మంది ఫుడ్ సేఫ్టీ బల్దియా ఆఫీసర్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే 27  మంది ఉండగా, మిగతా వారిని కేటాయించాలని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. కనీసం 60  మంది ఉంటేనే నెలకి 1800 శాంపిల్స్​సేకరించే అవకాశం ఉంటుందని, అప్పుడు నగరంలో ఆహార కల్తీని దాదాపు అరికట్టవచ్చని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

త్వరలో అవసరమైన అధికారులను కేటాయించనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్​ ప్రభుత్వం హయాంలో మూడేండ్ల పాటు బల్దియాలో నలుగురు ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రమే ఉండగా, చివరిలో ఆ సంఖ్య 10కి చేరింది..కాంగ్రెస్​వచ్చాక ఆ సంఖ్య 27కు పెరిగింది. మరింత పెంచితే ప్రభావవంతంగా పని చేస్తామని ఆ డిపార్ట్​మెంట్​అధికారులు చెప్తున్నారు.